Polavaram: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను విదేశీ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. ఈ బృందం ప్రాజెక్టును సందర్శించడం ఇది ఎనిమిదోసారి. విదేశీ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లీ, డేవిడ్ పాల్, డి సిస్కో, హించ్బెర్గర్తో తొలుత పోలవరం ప్రాజెక్టు అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత పరీక్షల ఫలితాలను అధికారులు ప్రజంటేషన్ ద్వారా వివరించారు. విదేశీ నిపుణుడు హించ్బెర్గర్ గత మే నెలలో పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆ తర్వాత పనుల్లో సాధించిన పురోగతితో పాటు ఇంకా పూర్తి చేయాల్సిన పనుల వివరాలను అధికారులు తాజా సమావేశంలో వెల్లడించారు. ప్రధాన డ్యాం నిర్మాణానికి అవసరమైన కోర్ (మట్టి) సిద్ధంగా ఉందని తెలిపారు.
వివరాలు
నడిచి వెళ్లి పనుల పరిశీలన
అదనంగా మరో 2లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని సిద్ధం చేసుకున్నట్లు వివరించారు.
ప్రధాన డ్యాం నిర్మాణానికి మొత్తం 30లక్షల క్యూబిక్ మీటర్ల రాళ్లు అవసరమని పేర్కొన్నారు.
ప్రాజెక్టులో చేపడుతున్న నాణ్యత పరీక్షలు, వాటి ఫలితాల గురించి చీఫ్ ఇంజినీర్ శేషుబాబు నిపుణులకు వివరించారు.
పోలవరం గ్యాప్-2లో ప్రధాన డ్యాం నిర్మాణపనులను విదేశీనిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
ప్రాజెక్టు ప్రాంతంలో వర్షం కురుస్తున్నప్పటికీ,నిపుణులు సుమారు 1.5కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
రానున్న మరో మూడురోజుల పాటు బృందం పోలవరంలోనే ఉండి ప్రాజెక్టు పనులను పరిశీలించనుంది.
ఈకార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్ ఓహ్రా,కార్యదర్శి రఘురామ్,సీఈ రమేష్కుమార్,జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి,సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.