Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. మరో మ్యానిఫెస్టో ప్రకటించిన బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పక్షాలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.
ఈ క్రమంలో బీజేపీ (BJP) తాజాగా మరో మ్యానిఫెస్టోను విడుదల చేసింది.
తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తామని హామీ ఇచ్చింది.
పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న యువతకు రూ.15 వేల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించింది.
వివరాలు
షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రత్యేక పథకాలు
భీమ్‌రావ్ అంబేడ్కర్ స్టైఫండ్ పథకం కింద ఐటీఐలు, పాలిటెక్నిక్ స్కిల్ సెంటర్లలో టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1,000 ఉపకార వేతనాలు అందిస్తామని బీజేపీ ప్రకటించింది.
అలాగే, ఆప్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తామని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా 'సంకల్ప పత్ర-2'ను విడుదల చేశారు.
వివరాలు
మొదటి భాగంలో ఇచ్చిన హామీలు
ఇదివరకే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా 'సంకల్ప పత్ర-1'ను విడుదల చేశారు.
ఇందులో గర్భిణి మహిళలకు రూ.21వేల ఆర్థికసాయం, పేద కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ (LPG) సిలిండర్‌లు అందించనున్నట్లు వెల్లడించారు.
'మహిళా సమృద్ధి యోజన' కింద దిల్లీలోని మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయాన్ని అందిస్తామని తెలిపారు.
వివరాలు
బీజేపీ పథకాలపై ఆప్ విమర్శలు
బీజేపీ మ్యానిఫెస్టోను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు.
"బీజేపీ ప్రకటించిన ఉచిత విద్య నిజంగా అందరికీ అందుబాటులో ఉంటుందా? ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే, తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం వారి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.
''దిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి'' అని కేజ్రీవాల్ హెచ్చరించారు.
ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుండగా, ఈ హామీలు ఓటర్లను ఎంతవరకు ఆకర్షిస్తాయో చూడాలి.