Andhra Pradesh Fuel Crisis: ఏపీలో ఇంధన సంక్షోభం.. బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు, వాహనదారుల అవస్థలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. అనేక పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు ఇంధనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు బంకుల్లో ఖాళీ కావడంతో వాహనదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. కొన్నిచోట్ల బంక్ సిబ్బంది, వాహనదారుల మధ్య వాగ్వాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా ఆయిల్ కంపెనీలు అప్పు ఆధారంగా ఇంధన సరఫరాను నిలిపివేయడమేనని సమాచారం. పెండింగ్ బకాయిలు చెల్లించిన తరువాతే సరఫరా పునరుద్ధరిస్తామని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం, పరిశ్రమల్లో వినియోగం తగ్గుదల వంటి అంశాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేశాయి.
వివరాలు
డీజల్ లభించకపోవడంతో పనులకు అంతరాయం
ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పలు బంకుల వద్ద రైతులు, వాహనదారులు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్‌లో ఈ కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు కోత యంత్రాలపై ఆధారపడి పంట కోస్తుండగా, డీజిల్ లభించకపోవడంతో పనులు అంతరాయం కలుగుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పంటను కాపాడుకోవడానికి రైతులు శ్రమిస్తున్న సమయంలో, డీజిల్ కొరత మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్న రైతులు యంత్రాలపై ఆధారపడుతున్నప్పటికీ, ఇంధనం లభించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.