LOADING...
Bill Gates: నేడు రాజధానికి బిల్‌గేట్స్‌ బృందం.. స్వర్ణాంధ్ర విజన్‌-2047పై చంద్రబాబు ప్రజంటేషన్
స్వర్ణాంధ్ర విజన్‌-2047పై చంద్రబాబు ప్రజంటేషన్

Bill Gates: నేడు రాజధానికి బిల్‌గేట్స్‌ బృందం.. స్వర్ణాంధ్ర విజన్‌-2047పై చంద్రబాబు ప్రజంటేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌ సోమవారం అమరావతికి రానున్నారు. ఆయనతో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు సభ్యుల ప్రతినిధుల బృందం సచివాలయాన్ని సందర్శించనుంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్,మంత్రి నారా లోకేశ్‌లతో వారు భేటీ అవుతారు. సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని బిల్‌ గేట్స్‌ పరిశీలిస్తారు. ఆర్టీజీఎస్‌ విధానం ఎలా పనిచేస్తోంది,దాని ద్వారా రాష్ట్రం సాధిస్తున్న ఫలితాలపై ముఖ్యమంత్రి గేట్స్‌కు వివరించనున్నారు. అనంతరం సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి గేట్స్‌ బృందంతో సమీక్షా సమావేశం జరుగుతుంది. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులను మరింత విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

వివరాలు 

స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యాలు

స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. మెడ్‌టెక్‌, డయాగ్నొస్టిక్స్‌ సేవలు, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం వంటి ప్రాజెక్టుల వివరాలను కూడా వెల్లడించనున్నారు. ప్రత్యేకంగా గేట్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో అమలవుతున్న 'సంజీవని' ప్రాజెక్టుపై దృష్టి సారించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో కలిసి ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని గేట్స్‌ బృందం సందర్శించనుంది. డ్రోన్లు, ఏఐ సాంకేతికతతో సాగు చేస్తున్న విధానాన్ని అక్కడ ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

వివరాలు 

గేట్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో సేవలు: మంత్రి సత్యకుమార్

ఇదిలా ఉండగా, గేట్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో వైద్యారోగ్య రంగంలో ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందిస్తామని ఆ శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. వ్యాధులను ముందుగానే గుర్తించి వ్యక్తిగతంగా అప్రమత్తం చేసే విధానం, హెల్త్‌ కార్డుల రూపకల్పన, డిజిటల్‌ ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాల్లో ఫౌండేషన్‌ సహకారం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలను సమీక్షించి అవసరమైన సంస్కరణలను సూచించేందుకు ఇప్పటికే 10 మంది అంతర్జాతీయ నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గేట్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో డీఎంఐడీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు.

Advertisement