GBS: మహారాష్ట్రలో జీబీఎస్ విజృంభణ.. ఐదుగురు మృతి.. 28 మంది రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) మహమ్మారి విజృంభిస్తోంది. ఫిబ్రవరి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 149 మంది అనుమానిత కేసులు నమోదయ్యాయి.
వారిలో 124 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అధికారికంగా నిర్ధారించారు. GBS అనేది అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి, ఇది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నాడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
దీంతో కండరాల బలహీనత, కొన్ని సందర్భాల్లో పారాలసిస్‌కి దారి తీయవచ్చు.
ఈ వ్యాధితో బాధపడుతున్న 124 మందిలో, 28 మందికి శ్వాస సంబంధిత సమస్యలతో వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది.
భారతీయ వైద్య పరిశోధనా మండలి ఈ వ్యాధి వ్యాప్తికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుపుతోంది.
Details
పూణేలో ఎక్కువ కేసులు
ఆరోగ్య పరీక్షలలో Campylobacter jejuni అనే బ్యాక్టీరియా కొందరి రోగుల మల నమూనాల్లో గుర్తించారు.
ముఖ్యంగా పుణే నగరంలో ఈ వ్యాధి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. పుణే నగరంలో 160 నీటి నమూనాలను పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపగా, 8 నీటి నమునాల్లో కాలుష్యం ఉన్నట్లు గుర్తించారు.
సిన్హగడ్ రోడ్ పరిసర ప్రాంతాల్లోని ఓ ప్రైవేట్ బోర్‌వెల్ నీటిలో E.coli అనే బ్యాక్టీరియా ఉందని అధికారికంగా వెల్లడైంది.
E.coli అంటే మలవిసర్జన లేదా జంతువుల వ్యర్థాలతో నీటి కాలుష్యం జరిగినట్లు అర్థం.
పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే నాందేడ్, కిర్కట్వాడి, ధయారి వంటి ప్రాంతాల్లో బోర్‌వెల్, బావుల నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది.
Details
ఈ వ్యాధి లక్షణాలివే
కండరాల బలహీనత
చేతులు, కాళ్లు బలహీనంగా మారడం లేదా పారాలసిస్
నొప్పి
కాళ్లు, వెన్ను ప్రాంతాల్లో తీవ్రమైన నొప్పి
శ్వాస సమస్యలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడకపోవడం
కంటిచూపు సమస్యలు
దృష్టి మసకబారడం, డబుల్ విజన్
రక్తపోటు సమస్యలు
గుండె రేటు మారడం, బీపీ అధికంగా లేదా తక్కువగా ఉండడం
మల, మూత్ర సమస్యలు
మల విసర్జన నెమ్మదించడం, మూత్ర నియంత్రణ కోల్పోవడం
జాగ్రత్తలు తీసుకోవాలి
నీటి కాలుష్యం నివారించాలి: తాగే నీటిని మరిగించి వాడండి
పరిశుభ్రత పాటించాలి: చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి
అలసట, బలహీనత కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఈ వ్యాధి తీవ్రంగా మారకముందే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.