Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి రెక్కలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో కొత్త యుగానికి శ్రీకారం!
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌తో రాష్ట్ర విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. విశాఖపట్నానికి 45 కిలోమీటర్లు, విజయనగరానికి 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్రంగా మారనుంది. దీంతో ఉత్తరాంధ్రలో విమానయాన సౌకర్యాలు, పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమలు, ఉపాధి వంటి రంగాల్లో వేగవంతమైన అభివృద్ధికి బాటలు పడనున్నాయి. శనివారం ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయంలో రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.
వివరాలు
వ్యవసాయ రంగానికి కొత్త అవకాశాలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా రవాణా చేసే అవకాశం లభించనుంది. దీంతో రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఉద్యాన పంటల ఎగుమతులకు ఊతం
మామిడి, జీడిపప్పు, కొబ్బరి, అరటి, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాల వంటి ఉద్యాన పంటల ఎగుమతులు మరింత వేగవంతం కానున్నాయి.
విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు, ప్యాక్ హౌస్‌లు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తరణకు అవకాశాలు పెరుగుతాయి.
మాంస ఉత్పత్తుల రంగానికి లాభం
మాంస ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో పాటు పశువుల మేత పరిశ్రమల్లో కూడా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.
వివరాలు
గనులు, తవ్వకాల రంగానికి మెరుగైన లాజిస్టిక్స్
ఖనిజాలు, పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు భారీ యంత్ర పరికరాల రవాణా సులభమవడంతో గనులు, తవ్వకాల రంగానికి మెరుగైన లాజిస్టిక్స్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
తయారీ రంగానికి వేగం
ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు వేగవంతమైన కార్గో రవాణా సౌకర్యం లభించనుంది.
ఫిషింగ్, ఆక్వా రంగానికి భారీ ప్రయోజనం
అమెరికా, జపాన్, యూరప్, గల్ఫ్ దేశాలకు రొయ్యలు, చేపలు, పీతలు వంటి సముద్ర ఆహార ఉత్పత్తులను వేగంగా ఎగుమతి చేసే అవకాశం ఏర్పడుతుంది.
నాణ్యతను కాపాడుతూ విదేశాలకు సరకు చేరడంతో మత్స్యకారుల ఆదాయం పెరిగే అవకాశముంది.
వివరాలు
టౌన్‌షిప్‌లు, వాణిజ్య అభివృద్ధి
విమానాశ్రయం చుట్టుపక్కల టౌన్‌షిప్‌లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, లాజిస్టిక్స్ పార్కులు, గోదాములు, పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందనున్నాయి.
పర్యాటక రంగానికి బూస్ట్
పర్యాటక రంగంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, రిటైల్ అవుట్‌లెట్లు, షాపింగ్ సెంటర్లు, కన్వెన్షన్ సెంటర్లు వంటి ఆతిథ్య రంగాలు విస్తరించనున్నాయి.
లాజిస్టిక్స్ రంగంలో వృద్ధి
ట్యాక్సీలు, బస్సులు, ట్రక్కింగ్, లాజిస్టిక్ ఆపరేటర్లు, వేర్‌హౌసింగ్, కోల్డ్ స్టోరేజ్, కంటెయినర్ రవాణా సేవల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యే అవకాశముంది.
స్థిరాస్తి రంగానికి రెక్కలు
ఏరోసిటీ అభివృద్ధి, నివాస సముదాయాలు, కార్యాలయ భవనాలు, ఇండస్ట్రియల్ పార్కులు, వాణిజ్య సముదాయాల నిర్మాణంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందనుంది.
వివరాలు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ కీలక మైలురాళ్లు
2015 జూన్: భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూత్రప్రాయ అంగీకారం.
2017 ఆగస్టు: పర్యావరణ అనుమతులు లభించగా, బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం.
2019 ఫిబ్రవరి: భోగాపురం మండలం దిబ్బపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన.
2020 జూన్: ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో అభివృద్ధి, నిర్వహణ కోసం జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ ఏర్పాటు.
2023 మే: అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి శంకుస్థాపన నిర్వహించారు.
2024 సెప్టెంబర్: విమానాశ్రయానికి 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'గా పేరు ప్రకటించారు.
2026 జనవరి: లైసెన్సింగ్ కోసం నిర్వహించిన తొలి విమాన పరీక్ష విజయవంతమైంది.