Chandrababu Naidu: పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యం.. కూటమి నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎన్నికల పోలింగ్ సరళి, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై కూటమి పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, ఓటర్ల భాగస్వామ్యం, శాంతిభద్రతలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. గతంలో నిర్వహించిన ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇంతటి స్ఫూర్తి కనిపించలేదని పేర్కొన్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఓటు వేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారని చెప్పారు.
వివరాలు
ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి
అయితే మరికొన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని గుర్తుచేశారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కూటమి శ్రేణులు కృషి చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ పోలింగ్ శాతం పెరిగేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
వివరాలు
అవాంఛనీయ ఘటనలపై అప్రమత్తంగా ఉండాలి
ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.
ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని స్పష్టం చేశారు.
మొత్తంగా ఎన్నికల నిబంధనలకు లోబడి వ్యవహరిస్తూనే ఓటర్లను పోలింగ్‌లో భాగస్వాములను చేయాలని, పోలింగ్ శాతం పెంపునకు క్షేత్రస్థాయిలో సమష్టిగా పనిచేయాలని చంద్రబాబు కూటమి శ్రేణులకు సూచించారు.