Polavaram Left Canal: ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు.. సిద్దమైన పోలవరం ఎడమ కాలువ
ఈ వార్తాకథనం ఏంటి
గోదారమ్మ ఉత్తరాంధ్ర వైపు అడుగులు వేస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 26 నెలల్లోనే పోలవరం ఎడమ కాలువ పనులను పూర్తి చేసి,గోదావరి వరద జలాలను ఈ ప్రాంతానికి తరలించేందుకు మార్గం సిద్ధం చేసింది. పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి వరద నీటిని ఎత్తిపోసి అనకాపల్లి జిల్లాకు అందించనున్నారు. దీంతో లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు,లక్షలాది మందికి తాగునీటి భద్రత కలగనుంది. ఈ కాలువ నిర్మాణం సాధారణమైన పనేమీ కాదు. పోలవరం ప్రధాన డ్యాం ప్రాంతమైన నేలకోట నుంచి 213 కిలోమీటర్ల మేర కాలువను తవ్వాల్సి వచ్చింది. మార్గంలో ఏలేరు,పంపా,తాండవ,వరహ నదులు ఎదురయ్యాయి. వాటి ప్రవాహాలకు అనుగుణంగా అక్విడక్టులు,సైఫన్లు వంటి క్లిష్టమైన నిర్మాణాలు చేపట్టారు.
వివరాలు
పంపా నదిపై ప్రత్యేక అక్విడక్టు
మరోవైపు కాలువ మార్గంలో అడ్డుగా ఉన్న తూర్పు కనుమల్లోని కొండలను తొలిచారు.
జాతీయ రహదారులను తొమ్మిది ప్రాంతాల్లో దాటేలా నిర్మాణాలు చేపట్టి కాలువకు మార్గం కల్పించారు.
పోలవరం ఎడమ కాలువ 92.10 కిలోమీటర్ వద్ద పంపా నదిని దాటుతుంది.
ఇక్కడ నదికి నాలుగు వైపులా అడ్డుకట్టలు వేసి అక్విడక్టు నిర్మించాల్సి వచ్చింది.
అయితే అడ్డుకట్టలు వేసినప్పటికీ భూగర్భం నుంచి ఊట నీరు రావడం నిర్మాణానికి ఇబ్బందిగా మారింది.
ఈ సమస్యను అధిగమించేందుకు నదీ గర్భంలో 312 జడ్ షీట్ పైల్స్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 100మీటర్ల లోతు నుంచి నిర్మాణ పనులు చేపట్టారు.
అక్విడక్టు పైభాగంలో పోలవరం ఎడమ కాలువ నీరు ప్రవహిస్తే.. దాని కింద నుంచి పంపా నది ప్రవాహం కొనసాగుతుంది.
వివరాలు
తాండవపై 447 మీటర్ల అక్విడక్టు
తాండవ నదిపై ఆరు మార్గాలతో కలిపి మొత్తం 447 మీటర్ల పొడవైన అక్విడక్టును నిర్మించారు.
గతంలో కొంత మేర పనులు జరిగినప్పటికీ మిగిలిన నిర్మాణాన్ని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసింది.
ఈ అక్విడక్టు 10,634 క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యంతో నిర్మించారు.
తుని-నర్సీపట్నం రహదారి మార్గంలో నిర్మాణం ఉండటంతో గతంలో సుమారు 200 మీటర్ల మేర అక్విడక్టు పనులు నిలిచిపోయాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను పూర్తి చేశారు.
నిర్మాణ సమయంలో విద్యుత్తు లైన్లతో పాటు తాగునీటి పైపులైన్లను కూడా మార్చాల్సి వచ్చింది.
వివరాలు
విస్కో పైపులైన్‌ను మార్చి..
విశాఖపట్నానికి గోదావరి నీటిని తరలించేందుకు గతంలో విస్కో పైపులైన్‌ను ఏర్పాటు చేశారు.
పోలవరం ఎడమ కాలువ నిర్మించాల్సిన మార్గంలో ఈ పైపులైన్ మూడు ప్రాంతాల్లో అడ్డుగా వచ్చింది.
దాన్ని తొలగించడం సాధ్యం కాకపోవడంతో మూడు చోట్ల పైపులైన్‌ను మార్గం మార్చి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలువ నిర్మాణ పనులు కొనసాగించారు.
ఏలేరు కిందుగా సైఫన్
పోలవరం ఎడమ కాలువ 57.887 కిలోమీటర్ వద్ద ఏలేరు నది ప్రవాహాన్ని దాటుతుంది. ఇక్కడ ప్రధాన కాలువను ఏలేరు నదీమట్టం కిందుగా తీసుకెళ్లేందుకు సైఫన్ నిర్మించారు.
దీంతో కాలువ నీరు కింద నుంచి ప్రవహిస్తుండగా.. ఏలేరు నది మాత్రం పైభాగంలో ఎలాంటి అంతరాయం లేకుండా తన మార్గంలోనే ప్రవహిస్తుంది.
వివరాలు
తూర్పు కనుమలను తొలిచి కాలువ నిర్మాణం
పోలవరం ఎడమ కాలువ మార్గంలో తూర్పు కనుమల్లోని ఎత్తైన కొండలు పెద్ద అడ్డంకిగా నిలిచాయి.
కాలువ నీరు గురుత్వాకర్షణ ఆధారంగా సజావుగా ప్రవహించాలంటే ఈ కొండలను తొలిచి మార్గం ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
ఎడమ కాలువ 111.50 కిలోమీటర్ నుంచి 113 కిలోమీటర్ మధ్యలో 107 మీటర్ల ఎత్తు ఉన్న కొండలను 28 మీటర్ల స్థాయికి తొలిచారు.
అంటే దాదాపు 79 మీటర్ల మేర కొండలను తొలగించి కాలువకు మార్గం ఏర్పాటు చేశారు.
ఈ పనులపై కొందరు జాతీయ హరిత ట్రైబ్యునల్, హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో న్యాయపరమైన సమస్యలను కూడా పరిష్కరించుకుంటూ నిర్మాణ పనులను కొనసాగించాల్సి వచ్చింది.
వివరాలు
వరహ నదిపై అక్విడక్టు
పోలవరం ఎడమ కాలువ 138.075 కిలోమీటర్ వద్ద వరహ నదిని దాటుతుంది. ఈ ప్రాంతంలో అక్విడక్టు నిర్మాణం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది.
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సమస్యలకు పరిష్కారం చూపించారు. అనంతరం కొత్త గుత్తేదారుకు పనులను అప్పగించారు.
కేవలం 45 రోజుల్లోనే మూడు పియర్లు, ఎనిమిది శ్లాబుల నిర్మాణాన్ని పూర్తి చేశారు.
అదే సమయంలో తాళ్లపాలెం ప్రాంతంలో నిర్వాసితుల తరలింపునకు సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించారు.
దీంతో అక్విడక్టు నిర్మాణంతో పాటు కాలువ పనులు ముందుకు సాగాయి.
వివరాలు
9చోట్ల జాతీయ రహదారిని దాటుకుంటూ..
పోలవరం ఎడమ కాలువ కోల్‌కతా-చెన్నై, కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారులను మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో దాటుతుంది.
ప్రత్తిపాడు, చందుర్తి, కత్తిపూడి, బెండపూడి, ఆరంపూడి, గవరయ్యకోనేరు ప్రాంతాల్లో వంతెనలను నిర్మించారు.
వాటికి అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేసి ముందుగా ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు.
అనంతరం జాతీయ రహదారిని తొలగించి, ఎడమ కాలువకు అవసరమైన మార్గాన్ని ఏర్పాటు చేశారు.
వివరాలు
ఎడమ కాలువతో ఎన్నో ప్రయోజనాలు
పుష్కర,పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా పోలవరం ఎడమ కాలువలోకి 5,000 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విడుదల చేయనున్నారు.
ఈ నీటితో పుష్కర ఎత్తిపోతల పథకం కాలువ పరిధిలోని 110 చెరువులను నింపనున్నారు.
పుష్కర కాలువ కింద ఉన్న 1.48 లక్షల ఎకరాల ఆయకట్టుకు యథావిధిగా సాగునీరు అందుతుంది.
ఏలేరు జలాశయం పరిధిలోని 80,700 ఎకరాలు, పంపా ఆయకట్టు కింద ఉన్న 12 వేల ఎకరాల భూములకు నీటి లభ్యత స్థిరీకరించబడుతుంది.
వివరాలు
ఎడమ కాలువతో ఎన్నో ప్రయోజనాలు
పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లోని 98 చెరువులను కూడా ఈ గోదావరి జలాలతో నింపనున్నారు.
అంతేకాకుండా తుని వరకు ఉన్న 143 గ్రామాలకు తాగునీటిని అందించే అవకాశం ఏర్పడుతుంది.
ఈ ప్రాంతాల్లో సుమారు 5.23 లక్షల మందికి తాగునీటి సరఫరాకు ఎడమ కాలువ కీలకంగా మారనుంది.