Loading...
Telangana: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 919 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం!
ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 919 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం!

Telangana: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 919 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబసభ్యుల కోసం అమల్లోకి తీసుకొచ్చిన 'న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌' (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) ద్వారా వైద్య సేవలు క్రమంగా వేగవంతమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పథకం కింద 919 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందుబాటులోకి వచ్చినట్లు ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకాన్ని నిర్వహిస్తున్న ఎంప్లాయీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు (ఈహెచ్‌సీటీ) ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. జులై 17న పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై ఈహెచ్‌సీటీ సమగ్ర వివరాలను ప్రభుత్వానికి అందించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

వివరాలు

919 ఆసుపత్రుల్లో సేవలు

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ కింద ఇప్పటి వరకు 919 ఆసుపత్రులు నమోదయ్యాయి.

15,395 చికిత్సలకు రూ.104.63 కోట్ల ముందస్తు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 778 ప్రైవేటు ఆసుపత్రులు, 141 ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి.

సెప్టెంబర్‌ 1 నుంచి పోలీసు శాఖను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు.

పథకం నిర్వహణ కోసం ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి ప్రతి నెలా రూ.44 కోట్లు సమకూరుతున్నాయి.

ప్రభుత్వం కూడా మరో రూ.44 కోట్లు అందిస్తోంది. దీంతో ప్రతి నెలా ఎన్‌ఈహెచ్‌ఎస్‌ కింద మొత్తం రూ.88 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తున్నాయి.

వివరాలు

వార్షిక బడ్జెట్‌ రూ.1,056 కోట్లు

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ కోసం వార్షిక బడ్జెట్‌ను రూ.1,056 కోట్లుగా అంచనా వేశారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే ఇన్‌పేషెంట్‌ సేవలతోపాటు ఔట్‌పేషెంట్‌ సేవలను కూడా ఈ పథకంలో చేర్చారు.

వెల్‌నెస్‌ కేంద్రాల్లో వైద్యులను సంప్రదించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, మందులు పొందడం వంటి సేవలను కూడా నగదురహితంగా అందిస్తున్నారు.

ప్రస్తుతం 12 జిల్లాల్లో 12 వెల్‌నెస్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరో 25 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

వీటిలో 21 కేంద్రాలను వివిధ జిల్లాల్లో, మరో నాలుగు కేంద్రాలను హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.

ఇన్‌పేషెంట్‌ వైద్య సేవల కోసం 1,816 సీజీహెచ్‌ఎస్‌ చికిత్స ప్యాకేజీలను అమలు చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

హెల్త్‌కార్డు లేకపోయినా వైద్యం

హెల్త్‌కార్డు జారీ కాలేదనే కారణంతో అర్హులైన వారికి వైద్య సేవలను నిరాకరించకూడదని అధికారులు స్పష్టం చేశారు.

ఉద్యోగులు, పింఛనుదారులు తమ గుర్తింపు సంఖ్య ఆధారంగా వైద్య సేవలను పొందవచ్చని తెలిపారు.

సెప్టెంబర్‌ 28 నాటికి 12,56,962 మంది లబ్ధిదారులకు హెల్త్‌కార్డులు అందుబాటులోకి వచ్చాయి. వీరిలో 7,56,210 మంది హెల్త్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు

పాత ఈహెచ్‌ఎస్‌ బకాయిల్లో రూ.70 కోట్లు విడుదల

కొత్త ఆరోగ్య పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పాత ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన బకాయిల్లో రూ.70 కోట్లు తాజాగా విడుదల చేసినట్లు ఈహెచ్‌సీటీ నివేదికలో పేర్కొంది.

ఇంకా రూ.100.52 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల్లో ప్రైవేటు ఆసుపత్రులకు రూ.23.85 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.76.67 కోట్లు చెల్లించాల్సి ఉంది.

మరోవైపు.. లబ్ధిదారులకు వైద్య సేవలు పొందే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా 30 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT