LOADING...
TGPSC: ఉద్యోగార్థులకు శుభవార్త.. ఇక ప్రతినెలా 2-3 టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు!
ఉద్యోగార్థులకు శుభవార్త.. ఇక ప్రతినెలా 2-3 టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు!

TGPSC: ఉద్యోగార్థులకు శుభవార్త.. ఇక ప్రతినెలా 2-3 టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఇకపై ప్రతినెలా రెండు నుంచి మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కీలక ప్రకటన చేసింది. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, వచ్చే వారం రోజుల్లోనే 280 పోస్టులతో కూడిన మూడు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో కాలుష్య నియంత్రణ మండలిలో 9 సహాయ పర్యావరణ ఇంజినీర్ పోస్టులు, రోడ్లు-భవనాల శాఖలో 222 ఏఈఈ సివిల్ పోస్టులు, 49 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయని వెల్లడించారు.

వివరాలు 

ఈ నెలలో మొత్తం ఆరు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసే అవకాశం

ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన 3,800 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు. వీటిలో అటవీ బీట్ అధికారుల 1,393 పోస్టులు కూడా ఉన్నాయని,వాటి భర్తీకి అవసరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించినట్లు వివరించారు. సోమవారం టీజీపీఎస్సీ కార్యాలయంలో సభ్యులు అమీరుల్లాఖాన్,విశ్వప్రసాద్,చంద్రకాంత్ రెడ్డి, లక్ష్మీకాంత్ రాథోడ్,కమిషన్ కార్యదర్శి హరితతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే వారం మూడు నోటిఫికేషన్లు విడుదలవుతాయని,ఈ నెలలో మొత్తం ఆరు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసే అవకాశం ఉందని బుర్రా వెంకటేశం తెలిపారు. కమిషన్‌పై నిరాధార ఆరోపణలు చేసే వారిపై అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఉండవని,ఈ నెలలోనే ఆ నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశముందని పేర్కొన్నారు.

వివరాలు 

సీబీఆర్‌టీ పరీక్షలకు ప్రాధాన్యం

ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి 90 శాతం నోటిఫికేషన్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీఆర్‌టీ) నిర్వహించే దిశగా కమిషన్ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే పరీక్షల నిర్వహణ సమయం తగ్గడమే కాకుండా ప్రశ్నపత్రాల ముద్రణ, తరలింపు, లీకేజీ వంటి సమస్యలకు చెక్ పడుతుందని చెప్పారు. సీబీఆర్‌టీ విధానంలో ప్రశ్నపత్రం పరీక్షకు కొద్ది గంటల ముందు లేదా అదే రోజు ఆటోమేటిక్‌గా సిద్ధమవుతుందని వివరించారు. పరీక్ష పూర్తయిన వెంటనే అభ్యర్థులు తమ స్కోరును స్క్రీన్‌పై చూసే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి సీబీఆర్‌టీ అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Advertisement

వివరాలు 

'ప్రతిభా వారధి'తో కొత్త అవకాశాలు

ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమలు చేస్తున్న 'ప్రతిభా సేతు' తరహాలో తెలంగాణలో 'ప్రతిభా వారధి' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది. టీజీపీఎస్సీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచినా తుది ఎంపిక జాబితాలో చోటు దక్కని అభ్యర్థులకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. మెరిట్ సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగాలు, ఇతర తాత్కాలిక పోస్టులు, అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.

Advertisement

వివరాలు 

నియామక ప్రక్రియకు గడువు

ఒకే దశలో నిర్వహించే నియామక ప్రక్రియలను మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఛైర్మన్ తెలిపారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ దశలు ఉన్న నియామకాల విషయంలో గరిష్ఠంగా తొమ్మిది నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని అమలు చేస్తామని వివరించారు. కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్టు గ్రేడ్-2) పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణ సోమవారంతో ముగిసిందని తెలిపారు. కేవలం 20 పోస్టులకే 19 వేల దరఖాస్తులు రావడం ఉద్యోగాలపై ఉన్న పోటీని సూచిస్తోందన్నారు.

వివరాలు 

ప్రతి నెలా రెండు నుంచి మూడు ఉద్యోగ ప్రకటనలు విడుదల

కొన్ని శాఖల్లో ఒకటి లేదా రెండు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని,వాటిని కలిపి ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలా లేదా అన్న అంశంపై ప్రభుత్వ శాఖలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 11 రకాల విభాగాల్లో 50కి పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని, వాటి కోసం నిరంతరాయంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి నెలా రెండు నుంచి మూడు ఉద్యోగ ప్రకటనలు విడుదల కావడంతో పాటు వివిధ నియామకాల తుది ఫలితాలు కూడా క్రమం తప్పకుండా ప్రకటిస్తామని పేర్కొన్నారు.

వివరాలు 

పోటీ పరీక్షలపై ఆసక్తి చూపుతున్న 7 నుంచి 8 లక్షల అభ్యర్థులు 

ఉద్యోగార్థులు తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత సుమారు 32 లక్షల మంది ఓటీఆర్ నమోదు చేసుకున్నప్పటికీ, వారిలో కొందరు వయోపరిమితి దాటగా మరికొందరికి ఇప్పటికే ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ప్రస్తుతం పోటీ పరీక్షలపై ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల సంఖ్య సుమారు 7 నుంచి 8 లక్షల మధ్య ఉందని బుర్రా వెంకటేశం వివరించారు.

Advertisement