Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. త్వరలో ఉచిత బస్సు ప్రయాణం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో విద్యార్థులకు మరో శుభవార్త అందించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయోజనం కేవలం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తించేలా నిబంధనలు రూపొందించే అవకాశముందని సమాచారం. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశంపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించినట్లు సమాచారం.
వివరాలు
నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకం
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కళాశాల స్థాయి వరకు మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రతి ఏడాది పెరుగుతున్న డ్రాప్‌అవుట్‌ల సంఖ్యను తగ్గించడంలో కూడా ఈ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తోంది.
వివరాలు
త్వరలోనే అధికారిక ప్రకటన
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆ హామీల్లో ముఖ్యమైనది మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకం. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు అదే తరహాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటే, ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కలగనుంది.