Telangana: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. డిగ్రీ, పీజీ కాలేజీలకు సెలవులు పొడిగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుండటం, వడగాల్పులు వీస్తుండటంతో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సెలవులను జూన్ 6 వరకు పొడిగించాయి. రాష్ట్రంలోని ప్రధాన సాంప్రదాయ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న క్యాంపస్, కాన్‌స్టిట్యుయెంట్, అఫిలియేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాలలన్నింటికీ ఈ నిర్ణయం వర్తించనుంది. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలు జూన్ 6 వరకు సెలవులు పొడిగిస్తూ అధికారిక సర్క్యులర్లు జారీ చేశాయి.
వివరాలు
జూన్ 5వరకు వేసవి సెలవులు
ఈ విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు జూన్ 8 (సోమవారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాలు జూన్ 5 వరకు వేసవి సెలవులను పొడిగించాయి. వీటి పరిధిలోని కళాశాలలు జూన్ 6 నుంచే పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, సాధారణ అధ్యాపకులకు సెలవులు కొనసాగుతున్నప్పటికీ, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో పాటు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న అధ్యాపకులు మాత్రం యథావిధిగా విధులకు హాజరుకావాలని విశ్వవిద్యాలయాలు స్పష్టం చేశాయి. కళాశాలల పరిపాలనా, విద్యా సంబంధిత పనులు అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
వివరాలు
మరికొన్ని రోజులు పొడిగింపు
యూజీసీ నిబంధనల ప్రకారం డిగ్రీ కళాశాలలకు ప్రతి ఏడాది 10 వారాల వరకు వేసవి సెలవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, కొలీజియట్ ఎడ్యుకేషన్ జేఏసీ చైర్మన్ డాక్టర్ కాదరు సురేందర్ రెడ్డి తెలిపారు. అయితే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు తొలుత మే 1 నుంచి మే 31 వరకు మాత్రమే సెలవులు ప్రకటించాయని, ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని సెలవులను మరికొన్ని రోజులు పొడిగించడం విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎండల తీవ్రత ఇంకా తగ్గని నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.