Telangana Housing Scheme : పేదలకు గుడ్‌న్యూస్.. రూ.300 కోట్లతో 5 వేల ఇళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పేదల కోసం రూ.300 కోట్లతో 5 వేల ఇళ్లను నిర్మించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తాన్లా ఫౌండేషన్ ఎండీ దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో అధునాతన సాంకేతికతతో ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీ సర్వీసులను శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, జారె ఆదినారాయణలతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో గంగారం గ్రామాన్ని దత్తత తీసుకున్నానని గుర్తుచేశారు.
వివరాలు
రూ.300 కోట్లతో 5 వేల ఇళ్లు
అయితే అప్పట్లో ఆశించిన స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోయానని తెలిపారు.
ప్రస్తుతం గంగారం గ్రామంలో పేదలు ఉన్నారని, వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే తాన్లా ఫౌండేషన్ ద్వారా ఎన్ని వందల ఇళ్లయినా నిర్మించి ఇస్తానని దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి తనకు తెలిపారని మంత్రి చెప్పారు.
ఈ నేపథ్యంలో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని, పేదల కోసం 5 వేల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఉదయ్‌కుమార్‌రెడ్డిని కోరినట్లు పొంగులేటి తెలిపారు. ఇందుకు ఆయన అంగీకరించారని చెప్పారు.
ఈ ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ దసరా పండగ రోజునే గంగారంలో ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తామని తెలిపారు.
వివరాలు
హైదరాబాద్‌లో రూ.70 కోట్లతో ఆసుపత్రి
ఇళ్ల నిర్మాణాలను ఏడాదిన్నరలోగా పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రారంభోత్సవం చేయిస్తామని పేర్కొన్నారు.
తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోనూ రూ.70 కోట్లతో వైద్యశాలను నిర్మించి ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
ఈ ఆసుపత్రిని డిసెంబరులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. అదే స్థాయిలో గంగారంలోనూ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇందుకోసం 20 ఎకరాల విస్తీర్ణంలో ఆసుపత్రిని నిర్మించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.