Dussehra special buses: దసరా పండుగకు ఆర్టీసీ గుడ్న్యూస్.. 7 వేల అదనపు బస్సులు సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
దసరా పండుగ సందర్భంగా నగరం నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రోజువారీ బస్సు సర్వీసులతో పాటు మరో 7 వేల అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి వెల్లడించారు. పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, ఈడీలు వెంకన్న, శ్రీధర్లతో కలిసి జేబీఎస్ (జూబ్లీ బస్ స్టేషన్)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎంలు సుచరిత, రాజులతో మాట్లాడి బస్సుల నిర్వహణ, ట్రాఫిక్ పరిస్థితులు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వారితో చర్చించారు.
వివరాలు
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులుండవు
అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు 95 శాతం బస్సు సర్వీసులను విజయవంతంగా నిర్వహించారు.
ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాలకు అదనపు బస్సులను నడపాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రత్యేక బస్సుల నిర్వహణలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించినట్లు తెలిపారు.
వివరాలు
ప్రత్యేక సర్వీసుల బస్సుల సిద్ధం
బస్సుల రాకపోకలు, నిర్వహణ, ప్రయాణికుల రద్దీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు.
దసరా పండుగ ముగిసిన అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తిరిగి నగరానికి చేరుకునే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నాగిరెడ్డి తెలిపారు.
నగరానికి తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా, స్వగ్రామాల నుంచి నగరానికి చేరుకునేందుకు వీలుగా ఇదే తరహాలో ప్రత్యేక బస్సు సర్వీసులను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.