Diwali Bonus: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ ఉద్యోగులకు దీపావళి కానుకగా రూ.13,816 బోనస్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన తపాలా శాఖ ఉద్యోగులకు, గ్రామీణ డాక్ సేవకులకు (GDS) పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ (PLB), ఎక్స్‌గ్రేషియా బోనస్‌ను ప్రకటించింది. ఈ నిర్ణయంతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), గ్రూప్-C, నాన్-గెజిటెడ్ గ్రూప్-B ఉద్యోగులతో పాటు గ్రామీణ డాక్ సేవకులకు కూడా ప్రయోజనం కలగనుంది. ఈ బోనస్‌ను 60 రోజుల వేతనాన్ని ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తారు. అయితే, బోనస్ గణనకు నెలవారీ వేతనంలో గరిష్ట పరిమితిగా రూ.7,000ను నిర్ణయించారు. ఈ లెక్కల ప్రకారం అర్హులైన ఉద్యోగులకు గరిష్టంగా సుమారు రూ.13,816 వరకు బోనస్ అందే అవకాశం ఉంది.
వివరాలు
బోనస్‌ను ఎలా లెక్కిస్తారు?
బోనస్ లెక్కింపు కోసం నిర్దేశించిన సూత్రం ప్రకారం.. ఉద్యోగి సగటు నెలవారీ వేతనాన్ని 60తో గుణించి, వచ్చిన మొత్తాన్ని 30.4తో భాగించాలి.
నిబంధనల ప్రకారం బేసిక్ పే, కరువు భత్యం (DA)వంటి నిర్దిష్ట భత్యాలను కూడా వేతనంలో భాగంగా పరిగణిస్తారు.
ఒకవేళ ఉద్యోగి వాస్తవ నెలవారీ జీతం రూ.7,000 కంటే ఎక్కువగా ఉన్నా, బోనస్ లెక్కింపు మాత్రం గరిష్ట పరిమితి అయిన రూ.7,000 ఆధారంగానే జరుగుతుంది.
గ్రామీణ డాక్ సేవకులకు (GDS) కూడా వారి టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (TRCA), కరువు భత్యం (DA) ఆధారంగా సగటు నెలవారీ సంపాదనను లెక్కిస్తారు.
ఈ లెక్కింపు ప్రకారం అర్హులైన జీడీఎస్ సిబ్బందికి గరిష్టంగా రూ.13,816 వరకు ఎక్స్‌గ్రేషియా బోనస్ చెల్లించే అవకాశం ఉంది.
వివరాలు
పదవీ విరమణ చేసినా, రాజీనామా చేసినా బోనస్ వర్తింపు
2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా డెప్యుటేషన్‌పై వెళ్లిన అర్హులైన ఉద్యోగులకు కూడా వారు పనిచేసిన కాలానికి అనుగుణంగా నిష్పత్తి ప్రకారం బోనస్ చెల్లిస్తారు.
అయితే, అసాధారణ సెలవులు (Extraordinary Leave) తీసుకున్న ఉద్యోగులకు చెల్లించే బోనస్‌లో కోత విధించే అవకాశం ఉంది.
ఉద్యోగి పనిచేసిన మొత్తం కాలం, బోనస్ లెక్కింపునకు అర్హమైన సగటు వేతనం ఆధారంగా తుది బోనస్ మొత్తంలో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.
మొత్తంగా దీపావళి పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తపాలా శాఖ ఉద్యోగులు, గ్రామీణ డాక్ సేవకులకు ఆర్థికంగా కొంత ఊరటనివ్వనుంది.