Lokesh on DSC: ఈ నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్.. నారా లోకేశ్ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త అందించారు. ఈ మార్చిలోనే మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవో నంబర్ 117ను రద్దు చేస్తామని, దానికి ప్రత్యామ్నాయంగా కొత్త విధానాలను అమలు చేస్తామని తెలిపారు.
అధ్యాపకుల బదిలీల చట్టంతో పాటు వారికి పదోన్నతులు కల్పించడం,పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే విద్యార్థులకు అందించే కిట్లపై రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు.
వివరాలు
విద్యా వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మిస్తాం: లోకేశ్
ఆదర్శ పాఠశాలలు,ఇతర ఉన్నత పాఠశాలలు విద్యార్థుల నివాసానికి చాలా దూరంగా ఉంటే,ఆ విద్యార్థులకు రవాణా భత్యం అందించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మిస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
భారత్‌లో ఏపీ విద్యా వ్యవస్థను అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన సంస్కరణలను అమలు చేస్తున్నామని అన్నారు.
జీవో 117 కారణంగా వచ్చిన ప్రతికూల ప్రభావాలను గురించి గతంలో చాలామంది తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ జీవో పేరుతో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందని, వారు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోయారని తెలిపారు.