Cab aggregators: అడ్వాన్స్ టిప్ విధానాన్ని నిలిపివేయండి.. క్యాబ్ అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
క్యాబ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్‌కు టిప్ చెల్లించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ పద్ధతి వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతోపాటు, అన్యాయమైన వ్యాపార విధానంగా మారే అవకాశం ఉందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. రైడ్ పూర్తయిన తర్వాత టిప్ ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా ప్రయాణికుడి ఇష్టమని ఆమె స్పష్టం చేశారు. ముందుగానే టిప్ చెల్లించకపోతే రైడ్‌ను డ్రైవర్ అంగీకరించరనే భావన ప్రయాణికుల్లో కలగకుండా చూడాలని అగ్రిగేటర్లకు సూచించారు. ఈ విధానంపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు అనేక ఫిర్యాదులు అందినట్లు నిధి ఖరే వెల్లడించారు.
వివరాలు
ర్యాపిడోపై ఇప్పటికే చర్యలు
ఈ నేపథ్యంలో క్యాబ్ అగ్రిగేటర్ Rapidoపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (CCPA) ఇప్పటికే చర్యలు తీసుకుంది.
సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. రైడ్ బుకింగ్ సమయంలో అదనంగా రూ.10, రూ.20, రూ.30 చెల్లించేలా యాప్ సూచనలు ఇస్తున్నట్లు సీసీపీఏ గుర్తించింది.
ఎక్కువ మొత్తంలో టిప్ చెల్లిస్తే రైడ్ లభించే అవకాశం పెరుగుతుందనే సందేశాలను యాప్ ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది.
ఈ విధానం వల్ల అదనపు చెల్లింపు చేయకపోతే రైడ్ దొరకదనే అభిప్రాయం ప్రయాణికుల్లో ఏర్పడే అవకాశం ఉందని సీసీపీఏ తెలిపింది.
వివరాలు
రైడ్ ఛార్జీలోనే అన్ని అంశాల పరిగణన
రైడ్ బుకింగ్ సమయంలోనే ప్రయాణ దూరం, సమయం, ట్రాఫిక్ పరిస్థితులు, టోల్ ఛార్జీలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఛార్జీ నిర్ణయిస్తారని సీసీపీఏ వివరించింది.
అలాంటి రైడ్‌కు సంబంధించి ఆ తర్వాత అదనంగా చెల్లించాలని వినియోగదారులను కోరడం సమర్థనీయం కాదని పేర్కొంది.
ఇదే అంశంపై Uber, Ola సంస్థలపైనా దర్యాప్తు కొనసాగుతోందని నిధి ఖరే తెలిపారు.