Raja Singh: హేట్ స్పీచ్ ఆరోపణలు.. రాజా సింగ్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా గట్టి షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగిస్తూ చర్యలు తీసుకుంది.
రాజా సింగ్ పేరుతో ఉన్న రెండు ఫేస్‌బుక్ పేజీలు, మూడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తొలగించినట్లు తెలుస్తోంది.
ఈ ప్లాట్‌ఫామ్స్‌లో సుమారు 10 లక్షల మంది ఫేస్‌బుక్ గ్రూప్ మెంబర్స్, 1.55 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారని సమాచారం.
రాజా సింగ్ సోషల్ మీడియాలో ధ్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక వెలువడిన వారం రోజుల్లోనే మెటా ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Details
చర్యలు తీసుకుంటున్న మెటా
2020లోనే మెటా రాజా సింగ్‌పై నిషేధం విధించినా ఆయన మద్దతుదారులు కొత్త గ్రూపులు, పేజీలను సృష్టిస్తూ ఆయన ప్రసంగాలను, కార్యాకలాపాలను విస్తృతంగా షేర్ చేయడాన్ని కొనసాగించారు.
అయితే ఇటీవల రాజా సింగ్ చేసిన కొన్ని పోస్టులు మరింత రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, ఇవే మెటా చర్యలకు దారితీసినట్లు తెలుస్తోంది.
IHL నివేదిక ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏప్రిల్ - జూన్ మధ్య బీజేపీ సీనియర్ నేతలు చేసిన 266 మైనారిటీ వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలను యూట్యూబ్, ఫేస్‌బుక్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారం చేశారు.
ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రాజా సింగ్ ప్రసంగాల్లో 74.5శాతం హేట్ స్పీచ్‌గా గుర్తింపు పొందింది.
Details
రాజా సింగ్ ప్రతిస్పందన
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించడంపై రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు.
ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్‌షిప్ దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు.
తన కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఖాతాలను కూడా బ్లాక్ చేయడం దురదృష్టకరమని అన్నారు.