Heat Wave: తెలంగాణలో ఎండల ఉధృతి.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అంతటా ఎండలు మరింతగా పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నేడు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ ప్రాంతాలతో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
వివరాలు
ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం
ఇదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.