Heatwave 2026: భారత్‌లో భగ్గుమంటున్న ఉష్ణోగ్రతలు.. టాప్ 20లో 19 నగరాలు మనవే..
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 20 నగరాల్లో 19 భారత్‌లోనే ఉండటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. బిహార్‌లోని భగల్పూర్, ఒడిశాలో తల్చేర్, పశ్చిమ బెంగాల్‌లో ఆసన్సోల్ నగరాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీని తర్వాతి స్థానాల్లో బీహార్‌కు చెందిన బేగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్‌పూర్, సీవాన్ వంటి ప్రాంతాలు కూడా 43 డిగ్రీల వద్ద నిలిచాయి. టాప్ 20లో భారత్ కాకుండా నేపాల్‌లోని లుంబిని ఉంది.
వివరాలు
ఉత్తరం నుంచి తూర్పు వరకూ ఎండల మోత.. దక్షిణంలో వర్షాలు
ఏప్రిల్ 22 నుంచి 24 వరకు హీట్‌వేవ్ కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య, తూర్పు భారత్‌లో ఒకేసారి ఉష్ణోగ్రతలు పెరగడం పెద్ద స్థాయి వాతావరణ మార్పుల ప్రభావమని నిపుణులు చెబుతున్నారు. మేఘాలు లేకపోవడం, ఎండ కిరణాలు తీవ్రంగా పడటం, మంచు కొరత, సముద్ర ఉష్ణోగ్రతల మార్పులు వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం వర్షాలు, గాలివానలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.