LOADING...
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు హెచ్చరికలు
తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు హెచ్చరికలు

Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు హెచ్చరికలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు రాబోయే మూడు రోజుల పాటు, అంటే ఏప్రిల్ 16 వరకు,రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 నుండి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 22 ముఖ్య ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర అవసరం లేకుండా ప్రజలు బయటకు రావొద్దని సూచనలు జారీ చేశారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆలూరు మండలం మాచెర్ల గ్రామంలో సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వివరాలు 

రాబోయే రోజుల్లో 42 డిగ్రీలకు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత

ఇతర ప్రాంతాల్లోనూ ఎండలు తీవ్రమయ్యాయి. నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌లో 43.1 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా భిక్నూర్‌లో 42.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజధాని హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత కొంత తక్కువగా 40.9 డిగ్రీలుగా నమోదైనప్పటికీ, రాబోయే రోజుల్లో ఇది 42 డిగ్రీలకు చేరే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement