Heavy rainfall: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రేపు,ఎల్లుండి పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీర సమీపంలో శనివారం ఒక అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో బుధవారం వరకు తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే సోమవారం, మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదవచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం నాడు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలకు అధిక అవకాశాలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో అయితే తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.
వివరాలు
మత్స్యకారులకు సముద్ర వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు
మంగళవారం కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాల అవకాశముండగా, ప్రకాశం,శ్రీసత్యసాయి,వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకు 35-55కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మత్స్యకారులు సోమవారం వరకు సముద్ర వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో,ఈ నెల 21వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా. దాని ప్రభావంతో 24 నుండి 27 వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
వివరాలు
అరకులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత..
రాష్ట్రంలో చలి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ-ఒడిశా సరిహద్దుల్లోని అనేక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో శుక్రవారం రాత్రి కనిష్ఠంగా 7 డిగ్రీలు నమోదు కాగా, అదే జిల్లాలోని డుంబ్రిగుడలో 7.6 డిగ్రీలు, హుకుంపేట, ముంచంగిపుట్టు ప్రాంతాల్లో 8.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.