LOADING...
Minister Farooq: కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్‌.. మంత్రి ఫరూక్‌ కీలక ప్రకటన
కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్‌.. మంత్రి ఫరూక్‌ కీలక ప్రకటన

Minister Farooq: కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్‌.. మంత్రి ఫరూక్‌ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైనారిటీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే స్థలాన్ని కేటాయించామని, బెంచ్‌ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియపై హైకోర్టుతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమం, న్యాయశాఖల్లో గత రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ఆయన వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కడపలో ప్రారంభించిన హజ్‌హౌస్‌ను వైకాపా ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసిందని విమర్శించారు. ఆ భవనాన్ని పూర్తి చేసి అక్కడ మైనారిటీల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే అమరావతిలో కొత్త హజ్‌హౌస్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించనున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

పీఎంజేవీకే కింద సద్భావనా మండపాలు

ప్రధానమంత్రి జన్‌వికాస్‌ కార్యక్రమం (పీఎంజేవీకే) కింద రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ముస్లింల కోసం సద్భావనా మండపాలను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా ఆటోనగర్ల ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నామని, ఇందుకు రూ.1,000 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఈ పథకం కింద గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించి పూర్తిచేసిన ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాల భవనాలను వైకాపా ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించిందని ఆరోపించారు. ఆ భవనాలను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తామని తెలిపారు. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయ భవన నిర్మాణాన్ని కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.

వివరాలు 

మైనారిటీ సంక్షేమంలో కీలక చర్యలు

గత రెండేళ్లలో మైనారిటీ సంక్షేమశాఖ, ఉపప్రణాళిక కింద మొత్తం రూ.9,759 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. ముస్లిం విద్యార్థులకు ఇంటర్‌ విద్యతో పాటు జేఈఈ, నీట్‌ ప్రవేశ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ అందించేందుకు తాలీం-ఏ-హునర్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 వక్ఫ్‌ సంస్థలను సర్వే చేసి, ఆక్రమణలో ఉన్న 88 ఎకరాల వక్ఫ్‌ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని వెల్లడించారు. మసీదులు, ఈద్గా, దర్గాలు తదితర వక్ఫ్‌ సంస్థల మరమ్మతుల కోసం రూ.5.74 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే ప్రతి యాత్రికుడికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.

Advertisement

వివరాలు 

న్యాయశాఖలో కీలక నిర్ణయాలు

రాష్ట్రంలో మొత్తం 65 వేల ఎకరాల వక్ఫ్‌ భూముల్లో సుమారు 28 వేల ఎకరాలు ఎన్నో ఏళ్లుగా ఆక్రమణలో ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం కోర్టుల్లో న్యాయపోరాటం కొనసాగిస్తోందని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం అవసరమైన 1,770 మంది సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస గృహాలు, గెస్ట్‌హౌస్‌లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.216 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కేసుల త్వరిత పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని హైకోర్టులో వివిధ విభాగాల్లో 245 కొత్త పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

Advertisement

వివరాలు 

న్యాయశాఖలో కీలక నిర్ణయాలు

న్యాయమిత్ర పథకం కింద జూనియర్‌ న్యాయవాదులకు అందించే స్టైపెండ్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని, త్వరలో అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. న్యాయాధికారుల పదవీవిరమణ వయసును 60ఏళ్ల నుంచి 61ఏళ్లకు పెంచామని చెప్పారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల గ్రాట్యుటీ పరిమితిని రూ.20లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. హైకోర్టులోని అదనపు ప్రభుత్వ న్యాయవాదుల(ఏజీపీలు)గౌరవ వేతనాన్ని 25శాతం పెంచామని తెలిపారు. స్పెషల్‌ జ్యుడిషియరీ మేజిస్ట్రేట్‌లు (సెకండ్‌ క్లాస్‌) పొందే గౌరవ వేతనాన్ని రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు పెంచడంతో పాటు, రవాణా ఖర్చుల కోసం నెలకు రూ.5వేల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి ఫరూక్‌ వివరించారు.

Advertisement