Hyderabad: రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో హైటెక్ బస్టాండ్లు.. ఆధునిక సదుపాయాలతో నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో నూతన బస్టాండ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఈ బస్టాండ్లలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతోపాటు.. షాపులు, వినోదం, ఫుడ్ కోర్టులకు కూడా ప్రత్యేకంగా స్థలం కేటాయించనున్నట్లు తెలిపింది. నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెంలో ఈ నూతన బస్టాండ్లు నిర్మించనున్నట్లు ఆర్టీసీ వివరించింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాళ్లతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ బస్టాండ్లలో షాపులు, బిజినెస్ కాంప్లెక్స్‌లను కేటాయించేందుకు ఆసక్తి ఉన్న వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ స్పష్టం చేసింది.
వివరాలు
కొడంగల్‌లో రెండు ఆప్షన్లు
ఇప్పటికే కొడంగల్, మద్దూరు, కోస్గి, హుస్నాబాద్ ప్రాంతాల్లో నూతన బస్టాండ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు వెల్లడించింది.
కొడంగల్‌లో 1.91 ఎకరాల భూమిలో నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. తొలి ఆప్షన్ కింద 39,558 చదరపు అడుగుల విస్తీర్ణంలో బస్టాండ్ నిర్మించనున్నారు.
ఇందుకు రూ.15.82 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించారు. రెండో ఆప్షన్‌గా 28,832 చదరపు అడుగుల విస్తీర్ణంలో బస్టాండ్ నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.
ఈ నిర్మాణానికి రూ.11.53 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
వివరాలు
కోస్గిలోనూ రెండు ప్రతిపాదనలు
కోస్గిలో 1.55 ఎకరాల విస్తీర్ణంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు.
ఆప్షన్-1 కింద 41,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.15.08 కోట్ల అంచనా వ్యయంతో బస్టాండ్ నిర్మించనున్నారు.
ఆప్షన్-2 కింద 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదించారు. ఇందుకు రూ.9.60 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించారు.
వివరాలు
మద్దూరులోనూ రెండు ఆప్షన్లు
మద్దూరులో 1.05 ఎకరాల స్థలంలో బస్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆప్షన్-1 కింద 19 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.7.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని నిర్ణయించారు.
ఆప్షన్-2 కింద 11,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో బస్టాండ్ నిర్మించేలా ప్రతిపాదించారు.
ఈ నిర్మాణానికి రూ.4.48 కోట్ల అంచనా వ్యయం అవుతుందని పేర్కొన్నారు.