Hindupur Businessman: హిందూపురం వ్యాపారికి వింత అనుభవం.. రూ.వెయ్యి కోట్లు జమ.. అరగంటలోనే ఖాతా ఖాళీ..
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారికి వింత అనుభవం ఎదురైంది. ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్నట్టుండి రూ.వెయ్యి కోట్లు జమ అయినట్లు కనిపించాయి. అంత భారీ మొత్తం తన ఖాతాలోకి ఎలా వచ్చిందో తెలియక ఆయన ఆశ్చర్యపోయారు. అయితే, అరగంటలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రూ.వెయ్యి కోట్ల సంగతి పక్కన పెడితే, అప్పటికే ఖాతాలో ఉన్న డబ్బులు కూడా కనిపించకుండా పోయాయి. దీంతో తన ఖాతాలోని సొమ్మును తిరిగి ఇప్పించాలని బ్యాంకు, పోలీసులను ఆశ్రయించారు.
వివరాలు
బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బులు జమ
హిందూపురంలోని సదాశివనగర్‌కు చెందిన తోట ఆనంద్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తున్నారు.
ఆయనకు ఓ ప్రైవేట్ బ్యాంకులో 1147924495 నంబరుతో ఖాతా ఉంది. మంగళవారం మధ్యాహ్నం ఆయన మొబైల్‌కు ఓ సందేశం వచ్చింది.
అందులో ఏముందోనని తెరిచి చూడగా, తన బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బులు జమ అయినట్లు కనిపించింది.
దీంతో వెంటనే బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించారు. అప్పటివరకు తన ఖాతాలో సుమారు రూ.32 వేల వరకు ఉన్నాయని, తాజాగా పరిశీలించగా ఏకంగా రూ.వెయ్యి కోట్లు జమ అయినట్లు కనిపించిందని ఆనంద్ తెలిపారు.
అంత భారీ మొత్తం తన ఖాతాలోకి ఎందుకు వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని తన స్నేహితులకు కూడా చూపించారు.
వివరాలు
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
అయితే, ఈ ఘటన జరిగిన అరగంటలోనే పరిస్థితి తారుమారైంది.
ఆనంద్ ఖాతాలోని బ్యాలెన్స్ సున్నాగా మారింది. మొదట తన ఖాతాలో ఉన్న రూ.32 వేలకుపైగా డబ్బులు కూడా కనిపించకపోవడంతో ఆయన ఆందోళనకు గురయ్యారు.
వెంటనే బ్యాంకుకు వెళ్లి జరిగిన విషయంపై ఆరా తీశారు. అయితే, బ్యాంకు సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నేరుగా హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.
తనకు ఎదురైన సమస్యను వివరించి ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆనంద్ తెలిపారు.
వివరాలు
చర్చనీయాంశంగా బ్యాంకు లావాదేవీల వ్యవహారం
తన ఖాతాలో రూ.వెయ్యి కోట్లు ఎలా జమ అయ్యాయన్నది పక్కన పెడితే, అప్పటికే ఉన్న డబ్బులు కూడా ఎలా మాయమయ్యాయన్నదే ఆయన ప్రధాన ఆందోళన.
తన ఖాతాలోని సొమ్మును తిరిగి ఇప్పించాలని బ్యాంకు, పోలీసులను కోరుతున్నారు.
ఈ వింత బ్యాంకు లావాదేవీల వ్యవహారం ప్రస్తుతం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది.