Loading...
Pulivendula: పులివెందులలో కూటమి చరిత్రాత్మక విజయం.. వైకాపాకు మూడు వార్డులే!
పులివెందులలో కూటమి చరిత్రాత్మక విజయం.. వైకాపాకు మూడు వార్డులే!

Pulivendula: పులివెందులలో కూటమి చరిత్రాత్మక విజయం.. వైకాపాకు మూడు వార్డులే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు ఐదు దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో కూటమి చరిత్ర సృష్టించింది. పులివెందుల పురపాలక సంఘంపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. వైకాపా అధ్యక్షుడు జగన్‌ సొంత నియోజకవర్గంలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గతంలో ఏ ఎన్నిక జరిగినా ఏకపక్షంగా గెలుస్తూ వచ్చిన వైకాపా.. ఈసారి కేవలం మూడు వార్డులకే పరిమితమైంది. ఛైర్‌పర్సన్‌ పదవితో పాటు మొత్తం 37 వార్డులను కూటమి కైవసం చేసుకుంది. తెదేపా అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి 13,875 ఓట్ల భారీ ఆధిక్యంతో వైకాపా అభ్యర్థి, జగన్‌ చిన్నాన్న మనోహరరెడ్డి భార్య ప్రమీలపై విజయం సాధించారు.

వివరాలు 

జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైఎస్‌ కుటుంబానికి తొలి ఎదురుదెబ్బ

పులివెందుల పురపాలక సంఘంలోని మొత్తం 40వార్డుల్లో 20వార్డులను కూటమి ముందుగానే ఏకగ్రీవంగా గెలుచుకుంది.

ఎన్నికలు జరిగిన మిగిలిన 20వార్డుల్లో 17స్థానాలను దక్కించుకుంది. వీటిలో తెదేపా 15,జనసేన, భాజపా ఒక్కో వార్డులో విజయం సాధించాయి.

జగన్‌ తాత వైఎస్‌ రాజారెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పులివెందులలో ప్రతి ఎన్నికా ఏకపక్షంగానే సాగేది.

ఏకగ్రీవాలైనా,రిగ్గింగ్‌ అయినా వైఎస్‌ కుటుంబానిదే ఆధిపత్యం.2005లో పురపాలక సంఘంగా ఏర్పడిన తర్వాత కూడా ఆ కుటుంబమే రాజకీయంగా పట్టు కొనసాగించింది.

అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరునెలల క్రితం జరిగిన జడ్పీటీసీ ఉపఎన్నికల్లో తెదేపా అభ్యర్థి విజయం సాధించడంతో వైఎస్‌ కుటుంబానికి తొలి ఎదురుదెబ్బ తగిలింది.

ఇప్పుడు పురపాలక సంఘాన్ని కూడా ఆ కుటుంబం కోల్పోయింది.

వివరాలు 

దీటుగా స్పందించిన కూటమి

వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత జగన్‌ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో పులివెందులలో ఎన్నికలు జరిగితే సామాన్యులు ఓటు వేసేందుకు కూడా భయపడే పరిస్థితులు ఉండేవని, ప్రతిపక్షాలకు ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండేది కాదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో కూటమి దీటుగా స్పందించి వైకాపా వ్యూహాలను ఎదుర్కొంది. అధికారాన్ని ఉపయోగించుకుని ప్రతివ్యూహాలు అమలు చేసింది.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే తన అనుచరులతో కలిసి ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించినప్పటికీ కూటమి నాయకులు వెనక్కి తగ్గలేదు.

పులివెందుల గడ్డపై నుంచి జగన్‌ సవాళ్లు విసిరినా కూటమి నేతలు ధైర్యంగా ముందుకు సాగారు.

ADVERTISEMENT

వివరాలు 

దీటుగా స్పందించిన కూటమి

చివరకు పోలింగ్‌ రోజున జగన్‌ తన పార్టీ ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపు సమయంలో వైకాపా తరఫున ఏజెంట్లు కూడా లేకపోవడం గమనార్హం.

ఆ పార్టీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి ప్రమీల సైతం పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేదు. పులివెందులలో వైఎస్‌ కుటుంబం రాజకీయంగా ఇంతటి నిస్సహాయ స్థితికి చేరడం ఇదే తొలిసారి.

ADVERTISEMENT

వివరాలు 

వ్యూహాత్మకంగా వ్యవహరించి ఘనవిజయం

పులివెందుల పురపాలక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి కూటమి నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఛైర్‌పర్సన్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించడంతో వైఎస్‌ కుటుంబం నుంచి జగన్‌ చిన్నాన్న మనోహరరెడ్డి భార్య ప్రమీల పోటీ చేశారు.

ఆమె గతంలో ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమెకు పోటీగా తూగుట్ల కుటుంబానికి చెందిన గీతాకుమారిని కూటమి బరిలోకి దించింది.

2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకానందరెడ్డి మద్దతుతో మధుసూదన్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలిచారు.

ఆయన భార్య గీతాకుమారిని ఈసారి ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

వివరాలు 

వ్యూహాత్మకంగా వ్యవహరించి ఘనవిజయం

తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (భాజపా) సమన్వయంతో పనిచేశారు.

మొత్తం 40 వార్డుల్లో 20 స్థానాలు ఏకగ్రీవం కావడంతో వైకాపా ఆత్మరక్షణలో పడింది.

వైఎస్‌ కుటుంబానికి బలమైన పట్టున్న ప్రాంతాల్లోనూ వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా వలసలు జరిగాయి.

దీంతో గతంలో కనీస ప్రాతినిధ్యం లేని వార్డుల్లోనూ తెదేపా బలం పెరిగింది.

పోలింగ్‌ రోజున వెయ్యిమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు భరోసా కల్పించారు.

దీంతో చాలా కాలం తర్వాత ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2019-24 మధ్య వైకాపా పాలనలో జరిగిన అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని కూటమి నేతలు పేర్కొన్నారు.

వివరాలు 

జమ్మలమడుగులోనూ కూటమి క్లీన్‌స్వీప్

జమ్మలమడుగు పురపాలక సంఘంలోనూ కూటమి ఘన విజయం సాధించింది.

తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి భార్య జ్యోతి 20,237 ఓట్ల భారీ మెజారిటీతో ఛైర్‌పర్సన్‌గా గెలిచారు.

మొత్తం 32 వార్డులనూ కూటమి కైవసం చేసుకుంది. వైకాపాకు ఒక్క వార్డు కూడా దక్కలేదు. ఆ పార్టీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి హైమావతి డిపాజిట్‌ కోల్పోయారు.

వివరాలు 

మాచర్లలో వైకాపా అభ్యర్థికి డిపాజిట్‌ గల్లంతు

మాచర్ల పురపాలక సంఘ ఎన్నికల్లో వైకాపా తరఫున షేక్‌ సుల్తానా నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే సకాలంలో బి.ఫారం సమర్పించకపోవడంతో ఆమె వైకాపా అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

ఆ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమెకు డిపాజిట్‌ కూడా దక్కలేదు.

ADVERTISEMENT