Loading...
Tiger: పులి జాడ చెప్పే డిజిటల్ గంట.. రేడియో కాలర్‌తో కదలికలపై నిఘా
పులి జాడ చెప్పే డిజిటల్ గంట.. రేడియో కాలర్‌తో కదలికలపై నిఘా

Tiger: పులి జాడ చెప్పే డిజిటల్ గంట.. రేడియో కాలర్‌తో కదలికలపై నిఘా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

పెద్దపులి మెడకు గంట కట్టడం సాధ్యమా? అని అనిపించొచ్చు. కానీ పులి, చీతా వంటి వన్యప్రాణుల మెడకు ప్రత్యేకమైన 'రేడియో కాలర్‌'ను అమర్చవచ్చు. ఇది ఒక రకంగా డిజిటల్‌ గంటలా పనిచేస్తుంది. ఈ పరికరం సాయంతో పులి ఏ దిశగా కదులుతోంది? ఒక రోజులో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తోంది? ఏ ఆవాస ప్రాంతంలో ఎక్కువ సమయం గడుపుతోంది? గ్రామాలు, రహదారులకు ఎంత చేరువగా వెళ్తోంది? వంటి వివరాలను శాస్త్రీయంగా గుర్తించవచ్చు. పరిమాణంలో చిన్నగా కనిపించే ఈ పరికరం ద్వారా లభించే సమాచారం మాత్రం అటవీశాఖకు ఎంతో కీలకంగా ఉంటుంది.

వివరాలు 

ప్రతి పులికీ ప్రత్యేక గుర్తింపు

అడవుల్లో సంచరించే ప్రతి పెద్దపులికి మనుషుల ఆధార్‌ సంఖ్య తరహాలో ప్రత్యేక గుర్తింపు కోడ్‌ ఉంటుంది. కే-6, కే-1, ఎస్‌-1, ఎస్‌-2 వంటి పేర్లతో వాటిని గుర్తిస్తారు.

కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసి పులుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు.

కొంతకాలం పాటు ఏదైనా పులి కనిపించకపోతే అది పక్క రాష్ట్రంలోని అడవులకు వెళ్లిందా? అనే కోణంలో అక్కడి అటవీ అధికారులను కూడా సంప్రదిస్తారు.

అయితే పులికి జీపీఎస్‌ రేడియో కాలర్‌ అమర్చితే పరిస్థితి మరింత సులభమవుతుంది.

పులి ఎక్కడ సంచరిస్తోంది, ఏ దిశలో వెళ్తోంది వంటి కదలికల సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి కంప్యూటర్‌లో నమోదు చేయవచ్చు.

వివరాలు 

పులి మెడకు రేడియో కాలర్‌ ఎలా అమరుస్తారు?

అడవిలో స్వేచ్ఛగా సంచరించే పులి లేదా చిరుత వంటి మాంసాహార జంతువుకు నేరుగా కాలర్‌ పెట్టడం సాధ్యం కాదు.

వాటిని పట్టుకోవడం కష్టంతో పాటు ప్రమాదకరం కూడా. అందుకే ముందుగా కెమెరా ట్రాప్‌లు, పాదముద్రలు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా జంతువు కదలికలను గుర్తిస్తారు.

ఆ తర్వాత అటవీశాఖ బృందం పర్యవేక్షణలో శిక్షణ పొందిన వెటర్నరీ వైద్యుడు పులికి మత్తు మందు ఇస్తారు.

పులి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత దాని ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తారు. బరువు, వయస్సు అంచనా, శరీర స్థితి తదితర వివరాలను నమోదు చేస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

పులి మెడకు రేడియో కాలర్‌ ఎలా అమరుస్తారు?

ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం పులి మెడకు జీపీఎస్‌ సదుపాయం ఉన్న రేడియో కాలర్‌ను బిగిస్తారు.

మత్తు ప్రభావం నుంచి పులి బయటకు వచ్చిన తర్వాత దాన్ని తిరిగి అడవిలోకి వదిలేస్తారు.

అనంతరం కాలర్‌ నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా పులి ఎక్కడికి వెళ్తోంది? ఏ ప్రాంతంలో ఎక్కువసేపు ఉంటోంది? వంటి అంశాలను అధికారులు తెలుసుకుంటారు.

మానవ నివాసాలకు పులి చేరువగా కదులుతున్నట్లు గుర్తిస్తే అప్రమత్తమై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

స్థానిక ప్రజలను ముందుగానే హెచ్చరించడం ద్వారా మనుషులు, పులుల మధ్య ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

'వాకర్‌'.. 3,020 కి.మీ. ప్రయాణం

రేడియో కాలర్‌ ద్వారా పులి కదలికలను ఎంత సమర్థంగా తెలుసుకోవచ్చో 'వాకర్‌'గా గుర్తింపు పొందిన సీ-1 మగపులి ప్రయాణం చక్కటి ఉదాహరణ.

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి బయలుదేరిన ఈ పులి తెలంగాణలోని ఆదిలాబాద్‌ ప్రాంతంలోకి ప్రవేశించింది. అనంతరం తిరిగి మహారాష్ట్ర అడవులకు చేరుకుంది.

ఈ ప్రయాణంలో సీ-1 పులి 13 నెలల వ్యవధిలో ఏకంగా 3,020 కిలోమీటర్లు తిరిగినట్లు రేడియో కాలర్‌ ద్వారా గుర్తించారు.

దాని కదలికలను విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పగటి సమయంతో పోలిస్తే రాత్రివేళల్లోనే ఆ పులి రహదారులను ఎక్కువగా దాటినట్లు గుర్తించారు.

వివరాలు 

చిన్న కాలర్‌.. అడవికి పెద్ద నిఘా

భారత్‌లో చీతాల పునఃప్రవేశ కార్యక్రమంలో భాగంగా విదేశాల నుంచి చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో వదిలారు.

వాటి మెడకు కూడా రేడియో కాలర్లను అమర్చారు. ఈ పరికరాల నుంచి అందుతున్న సమాచారంతో చీతాలు ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తున్నాయి? ఏ ప్రాంతాన్ని లేదా ఆవాసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాయి? వంటి వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు.

అందుకే పులి, చీతా వంటి వన్యప్రాణుల మెడకు అమర్చే చిన్న రేడియో కాలర్‌.. వాటి జీవన విధానం, సంచార మార్గాలు, ఆవాస వినియోగం గురించి తెలుసుకోవడంలో కీలకమైన శాస్త్రీయ సాధనంగా మారింది.

ADVERTISEMENT