Alcohol Prices Increase : మందుబాబులకు భారీ షాక్.. మద్యం ధరలు 15% వరకు పెంపు?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మద్యం ప్రియులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ తయారీ సంస్థల విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ధరల పెంపునకు సంబంధించిన ఫైల్‌ను రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముడిసరుకుల ధరలు, రవాణా వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మద్యం ధరలను కూడా పెంచాలని లిక్కర్ తయారీ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాయి. ధరల పెంపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో త్రిసభ్య కమిటీని నియమించింది.
వివరాలు
మూడ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక
ఈ కమిటీ గత మూడు రోజులుగా మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించింది. శుక్రవారంతో ఈ చర్చలు ముగిశాయి. సమావేశాల్లో మద్యం ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని కంపెనీలు కమిటీ సభ్యులను కోరినట్లు సమాచారం. కంపెనీల ప్రతిపాదనల ప్రకారం, సాధారణ ఫుల్ బాటిల్ ధరపై గరిష్ఠంగా రూ.80 వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ప్రీమియం బ్రాండ్లపై రూ.90 వరకు, హై-ఎండ్ లేదా అత్యంత ఖరీదైన బ్రాండ్లపై రూ.120కు పైగా ధరలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తన తుది నిర్ణయంపై బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమై చర్చించిన అనంతరం ధరల పెంపు ఫైల్‌ను రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.
వివరాలు
ఈనెల 15 నుంచి అమల్లోకి
ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈ నెల 15 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలను పెంచిన నేపథ్యంలో ఈసారి బీర్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2,620 వైన్ షాపులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మద్యం ధరల పెంపు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల అదనంగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వార్షికంగా ఇది రూ.2,400 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు అదనపు ఆదాయంగా మారవచ్చని అధికారులు భావిస్తున్నారు.