Loading...
Hyderabad: హైదరాబాద్‌లో వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టం.. భవిష్యత్‌లో తాగునీటి సంక్షోభంపై నిపుణుల హెచ్చరిక
భవిష్యత్‌లో తాగునీటి సంక్షోభంపై నిపుణుల హెచ్చరిక

Hyderabad: హైదరాబాద్‌లో వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టం.. భవిష్యత్‌లో తాగునీటి సంక్షోభంపై నిపుణుల హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని హైదరాబాద్‌ పరిధిలో భూగర్భ జలమట్టం ఆందోళనకరంగా పడిపోతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం,బోర్‌వెల్ల ద్వారా భూగర్భ జలాల వినియోగం అధికంగా పెరగడం వల్ల నీటి మట్టం మరింత లోతుకు వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో తాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ,ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్‌)పరిధిలోని హైదరాబాద్‌,రంగారెడ్డి,మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 46 మండలాల్లో భూగర్భ జలవనరుల శాఖ ఫీజోమీటర్ల ద్వారా ప్రతి నెల నీటి మట్టాన్ని నమోదు చేస్తోంది. జూన్ నెలకు సంబంధించిన తాజా గణాంకాల ప్రకారం, గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 30 మండలాల్లో భూగర్భ జలమట్టం మరింత తగ్గినట్లు వెల్లడైంది.

వివరాలు 

17 జిల్లాల్లో మరింత లోతుకు నీటి మట్టం

రాష్ట్ర జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది నివసిస్తున్న హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోవడం భవిష్యత్ అవసరాలపై ఆందోళన కలిగిస్తోంది.

భూమిలో నీటి నిల్వలు ఇలాగే క్షీణిస్తే రానున్న రోజుల్లో నీటి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని 17 జిల్లాల్లో జూన్ నెలలో భూగర్భ జలమట్టం తగ్గింది.

అయితే ఇతర జిల్లాల్లో నమోదైన పెరుగుదలతో రాష్ట్ర సగటు నీటి మట్టం స్వల్పంగా 0.01 మీటర్లు మెరుగుపడింది.

గత ఏడాది జూన్‌లో రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 9.47 మీటర్లుగా ఉండగా, ఈ ఏడాది అది 9.46 మీటర్లుగా నమోదైంది.

వివరాలు 

నీటి మట్టం అత్యధికంగా తగ్గిన జిల్లాల్లో తొలి స్థానంలో హైదరాబాద్

నీటి మట్టం అత్యధికంగా తగ్గిన జిల్లాల్లో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది.

గత ఏడాది జూన్‌లో 9.96 మీటర్లుగా ఉన్న నీటి మట్టం ఈసారి 12.43 మీటర్లకు చేరడంతో 2.47 మీటర్ల మేర క్షీణించింది.

అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.51 మీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.33 మీటర్లు, హనుమకొండలో 1.33 మీటర్లు,పెద్దపల్లిలో 1.33మీటర్లు,నిజామాబాద్‌లో 1.12 మీటర్లు,జగిత్యాలలో 0.99 మీటర్లు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0.95మీటర్ల మేర భూగర్భ జలమట్టం తగ్గినట్లు నమోదైంది.

మరోవైపు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పెరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 2.86 మీటర్ల పెరుగుదల నమోదైంది.

నాగర్‌కర్నూల్,నల్గొండ,వికారాబాద్,జనగామ జిల్లాల్లో కూడా మీటరుకు పైగా నీటి మట్టం పెరిగినట్లు భూగర్భ జలవనరుల శాఖ గణాంకాలు వెల్లడించాయి.

ADVERTISEMENT