Nepal floods: నేపాల్ వరదల్లో తల్లిదండ్రుల గల్లంతు.. కన్నీళ్లతోనే నీట్ పరీక్ష రాసిన యువతి
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో సంభవించిన వరదలు, ప్రకృతి విపత్తు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కైలాస మానసరోవర యాత్ర కోసం నేపాల్‌కు వెళ్లిన వందలాది మంది భారతీయులు వరదల్లో చిక్కుకుని గల్లంతయ్యారు. వారిలో తన తల్లిదండ్రులు కూడా ఉన్నారని నీట్ అభ్యర్థి తన్వి సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వెల్లడించారు. తల్లిదండ్రులు వెంకట్రామ్ అన్నందేవర, అనఘ.. మరో 67 మందితో కలిసి కైలాస మానసరోవర యాత్రకు వెళ్లినట్లు తన్వి తెలిపారు. నేపాల్‌లోని ఇమిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న సమయంలోనే వారితో చివరిసారిగా మాట్లాడానని చెప్పారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
తల్లిదండ్రులు తన పక్కన లేకపోయినా..
తల్లిదండ్రుల ఆచూకీ తెలియక మానసికంగా తీవ్ర వేదన అనుభవిస్తున్నప్పటికీ.. వారి కోరికను గుర్తుచేసుకుని నీట్ పరీక్షకు హాజరయ్యారు తన్వి.
తన భవిష్యత్తు కోసం అమ్మానాన్న ఎన్నో కలలు కన్నారని, వారి ఆశయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
''మూడు గంటలపాటు జరిగిన పరీక్షలో దాదాపు సగం సమయం కన్నీళ్లు పెట్టుకుంటూనే గడిచింది. నా అడ్మిట్ కార్డుపై ఉన్న ఫొటోను నాన్నే తీశారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆ ఫొటో కనిపించడంతో ఆయన పదే పదే గుర్తుకొచ్చారు. దీంతో భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాను'' అని తన్వి తెలిపారు.
వివరాలు
అమ్మ తినిపించిన పెరుగులో పంచదార గుర్తొచ్చి..
తాను ఏ పరీక్షకు వెళ్లినా మంచి మార్కులు సాధించాలని అమ్మ ఎంతో కోరుకునేవారని తన్వి గుర్తుచేసుకున్నారు.
పరీక్షకు వెళ్లే ప్రతిసారీ తనకు పెరుగులో పంచదార కలిపి తినిపించేదని చెప్పారు.
ఇప్పుడు ఆప్యాయంగా చూసుకునే అమ్మ తన పక్కన లేకపోవడం మరింత బాధకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
''మానసికంగా ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నప్పటికీ.. అమ్మానాన్నల కోరిక మేరకు ఈ పరీక్ష తప్పకుండా రాయాలని నిర్ణయించుకున్నా. నా భవిష్యత్తు కోసం వారు ఎన్నో కలలు కన్నారు. అందుకే వారి ఆశీర్వాదం నాతో ఉందనే నమ్మకంతో పరీక్ష రాశాను. వారు సురక్షితంగా తిరిగి వస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నా'' అని తన్వి కన్నీటి పర్యంతమయ్యారు.