ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు
ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియోకాన్ రుణం కేసులో బాంబే హైకోర్టు వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 5న ప్రత్యేక సీబీఐ కోర్టు తన బెయిల్ అభ్యర్థనను తిరస్కరించడంతో ధూత్ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని తన పిటిషన్‌లో ధూత్ పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారించిన బాంబే హైకోర్టు రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్‌ను మంజురు చేసింది. ఆ డబ్బును మహారాష్ట్ర న్యాయ సహాయకుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఐసీఐసీఐ రుణ మోసం కేసులో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ డిసెంబర్ 26, 2022న అరెస్టు చేసింది.
చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరు
ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసులో అరెస్టైన చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు ఇప్పటికే బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారిని అరెస్టు చేసిన విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారి అరెస్టు చట్ట ప్రకారం జరగలేదని చెప్పింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం.. విచారణ ప్రారంభించేందుకు చట్టంలోని సెక్షన్ 17ఎ కింద అనుమతి తప్పనిసరి అని, ఈ దర్యాప్తును ప్రారంభించడానికి సీబీఐ అలాంటి అనుమతి తీసుకోలేదని కొచ్చర్ దంపతులు కోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు విచారించిన బాంబే హైకోర్టు..సీబీఐ తీరును తప్పుబట్టింది. కొచ్చర్ దంపతులకు బెయిల్ మంజూరు చేసింది. తన అరెస్టు విషయంలో కూడా సీబీఐ అధికారులు చట్టప్రకారం వ్యవహరించలేదని ధూత్ హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.