Page Loader
'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
చందా కొచ్చర్‌, దీపక్‌కు బెయిల్ మంజూరు

'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Stalin
Jan 09, 2023
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ అరెస్టుపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారి అరెస్టు చట్ట ప్రకారం జరగలేదని, ఈ మేరకు వారికి బెయిల్ మంజూరు చేసింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం.. విచారణ ప్రారంభించేందుకు చట్టంలోని సెక్షన్ 17ఎ కింద అనుమతి తప్పనిసరి అని, ఈ దర్యాప్తును ప్రారంభించడానికి సీబీఐ అలాంటి అనుమతి తీసుకోలేదని కొచ్చర్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారించిన బాంబే హైకోర్టు.. సీబీఐ తీరును తప్పుబట్టింది. సొంత పూచీకత్తుతో కొచ్చర్ దంపతులకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పాస్‌పోర్టులను సీబీఐకి అప్పగించాలని వారిని ఆదేశించింది.

చందా కొచ్చర్

దీపక్ కంపెనీలో ధూత్ పెట్టుబడులు?

చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్‌కు నేతృత్వం వహిస్తున్నప్పుడు వీడియోకాన్ గ్రూప్‌నకు అందించిన రూ.3,250 కోట్ల రుణంలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసులో డిసెంబర్ 23న సీబీఐ కొచ్చర్ దంపతులను అరెస్టు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీని ఉల్లంఘిస్తూ వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన కంపెనీలకు ఐసిఐసిఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణ సదుపాయాలను మంజూరు చేసిందని సీబీఐ తన అభియోగాల్లో పేర్కొంది. వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు ఈ రుణం మంజూరు చేయడం వల్ల.. చందా కొచ్చర్ భర్త దీపక్‌ కొచ్చర్‌ ప్రయోజనం పొందారని సీబీఐ ఆరోపించింది. దీపక్‌కు చెందిన సంస్థ న్యూ పవర్ రెన్యూవబుల్స్‌లో ధూత్ రూ. 64కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.