ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ కుంభకోణం కేసు : కొచ్చర్ దంపతులకు సీబీఐ కస్టడీలోనూ సకల సౌకర్యాలు
ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌లు ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే కస్టడీలో ఉన్నన్ని రోజులు వీరు ప్రత్యేక వసతులు వినియోగించుకునేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. శీతాకాలం అయిన నేపథ్యంలో తమను చలిలో నేలపై పడుకోబెడుతున్నారని సీబీఐ కోర్టుకు కొచ్చర్ దంపతులు, ధూత్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. తమ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని.. ప్రత్యేక పడకలు, పరుపులు, దిండ్లు, తువ్వాళ్లు, దుప్పట్లు వినియోగించుకునే అనుమతి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు.
ఇంటి నుంచి ఆహారం..
కొచ్చర్ దంపతులు, ధూత్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రత్యేక వసతులను వినియోగించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. నిందితుల సొంత ఖర్చుతో ఈ వస్తువులను వినియోగించుకోవాలని కోర్టు చెప్పింది. ఇంట్లో వండిన ఆహారాన్ని తెప్పించుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతుల ప్రకారం.. విచారణ పూర్తయ్యే వరకు నిందితులు ప్రతిరోజూ ఒక గంట పాటు తమ న్యాయవాదులతో మాట్లాడుకోవచ్చు. అలాగే.. ధూత్‌కు ఇన్సులిన్‌ను అందించడంలో సహాయం చేయడానికి ఒక అటెండర్‌ను అతనితో ఉండవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు రుణ మోసం కేసులో సీబీఐ సోమవారం ఉదయం ముంబైలో ధూత్‌ను అరెస్టు చేసింది. కొచ్చర్లను శుక్రవారం రాత్రి సీబీఐ అరెస్ట్ చేసింది.