Donald Trump: 'క్యూబాను స్వాధీనం చేసుకుంటా'.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన దృష్టి క్యూబాపై పడింది. ఆ ద్వీప దేశాన్ని అమెరికా ఆధీనంలోకి తీసుకురావాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. క్యూబా అంతటా విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న సమయాన ఈ ప్రకటన చేయడం విశేషంగా మారింది. విలేకరులతో మాట్లాడిన ట్రంప్, క్యూబాను స్వాధీనం చేసుకునే అవకాశంపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. అలా జరిగితే అది తనకు ఎంతో గొప్ప విషయం, గౌరవంగా భావిస్తానన్నారు. క్యూబాను తమ నియంత్రణలోకి తెచ్చుకుని, తాను కోరుకున్న లక్ష్యాలను సాధించగలనని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
9.6 మిలియన్ల మంది ప్రజలు చీకట్లో..
ఇక మరోవైపు, అమెరికా విధించిన చమురు ఆంక్షల ప్రభావం క్యూబాపై తీవ్రంగా పడింది. ఇంధన సరఫరా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దాంతో సుమారు 9.6 మిలియన్ల మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. గత మూడు నెలలుగా క్యూబాకు పెద్ద ఎత్తున ఇంధన సరఫరా జరగలేదని ఆ దేశ అధ్యక్షుడు మిగెల్ దియాజ్ కానెల్ ఇటీవల వెల్లడించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.