supreme court: సైబర్ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వండి: సోషల్ మీడియా సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ అరెస్ట్ మోసాలు,సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నేరాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో అమలు చేయబోయే నివారణ మార్గాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని వాట్సాప్‌తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. తమ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న సాంకేతిక భద్రతా చర్యల వివరాలను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు కూడా అందించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా ఖాతాదారులు సైబర్ మోసాలకు గురై డబ్బు కోల్పోతే,ఆ నష్టాన్ని సంబంధిత బ్యాంకులే భరించేలా నిబంధనలు రూపొందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు ధర్మాసనం సూచించింది.
వివరాలు
తదుపరి విచారణ నవంబర్ 23వ తేదీకి వాయిదా
డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..ఈ తరహా నేరాల నియంత్రణకు వాట్సాప్, బ్యాంకులు, పోలీసు విభాగాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఖాతాదారుల సాధారణ లావాదేవీలకు భిన్నంగా అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు బదిలీ అవుతున్నప్పుడు బ్యాంకులు ఎందుకు అప్రమత్తం కావడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇలాంటి అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి అడ్డుకునేందుకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు,సైబర్ మోసాలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు,వాటిపై జరుగుతున్న దర్యాప్తు పురోగతికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆర్‌బీఐ రూపొందించిన కొత్త కేవైసీ మార్గదర్శకాలను కూడా ధర్మాసనం స్వయంగా పరిశీలించనున్నట్లు వెల్లడించింది.
ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 23వ తేదీకి వాయిదా వేసింది.