Hrithik Roshan: అంతర్జాతీయ వేదికపై హృతిక్ రోషన్ చరిత్ర.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. లాస్ ఏంజిల్స్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఎల్‌ఏసీఎంఏ ఆర్ట్ + ఫిల్మ్ గాలాకు హాజరైన తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించాడు. నవంబర్ 7న జరిగిన ఈ 15వ వార్షికోత్సవ వేడుకలో హృతిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
వివరాలు
డార్క్ బ్లూ టక్సెడోలో మెరిసిన హృతిక్
ఈ కార్యక్రమానికి హృతిక్ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ 'బ్రునెల్లో కుసినెల్లి' రూపొందించిన డార్క్ బ్లూ టక్సెడో ధరించి హాజరయ్యాడు.
రెడ్ కార్పెట్‌పై ఫొటోగ్రాఫర్లకు రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఇలా భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై చాటాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాలు
హాలీవుడ్ ప్రముఖులతో సందడి
ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో సహ-చైర్‌గా వ్యవహరించే ఈ గాలా.. కళలు, సినిమా రంగాలను ప్రోత్సహించేందుకు నిధులు సేకరిస్తుంది.
ఈ ఏడాది వేడుక ద్వారా దాదాపు 70 లక్షల డాలర్లు సమీకరించారు. హృతిక్‌తో పాటు టామ్ హ్యాంక్స్, కిమ్ కర్దాషియన్, ఆండ్రూ గార్‌ఫీల్డ్, తిమోథీ చలమెట్ వంటి పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడుకలో భారత సంతతికి చెందిన నిర్మాత కవితా గుప్తా హృతిక్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు.
'డ్యూన్' చిత్ర దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్, నటి నికోల్ కిడ్‌మాన్‌లతో హృతిక్ దిగిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్‌గా మారాయి.
వివరాలు
'క్రిష్ 4'తో దర్శకుడిగానూ..
సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హృతిక్, త్వరలో 'క్రిష్ 4' చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాలో నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరించనున్నాడు.