LOADING...
Mojtaba Khamenei: క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించిన మొజ్తబా ఖమేనీ
క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించిన మొజ్తబా ఖమేనీ

Mojtaba Khamenei: క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించిన మొజ్తబా ఖమేనీ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ఆయన కుమారుడు, ప్రస్తుతం నాయకత్వ బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ అతి స్వల్ప వ్యవధిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం బయటపడింది. 'ది టెలిగ్రాఫ్' నివేదిక ప్రకారం, క్షిపణులు భవనాన్ని ఢీకొట్టే కొద్దిసేపటి ముందే ఆయన గది విడిచి తోటవైపు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇరాన్ ఉన్నతాధికారుల మధ్య జరిగిన రహస్య సమావేశానికి సంబంధించిన ఆడియో బయటకు రావడంతో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాలు 

మొజ్తబాకు కాలికి స్వల్ప గాయం

ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ విభాగం అధిపతి మజహర్ హొస్సేనీ ఆ ఆడియోలో మాట్లాడుతూ, "దేవుని సంకల్పం వల్లే మొజ్తబా క్షిపణి దాడికి ముందే ఏదో పని మీద బయటకు వచ్చి తోటలోకి వెళ్లారు. ఆయన మెట్లు ఎక్కుతున్న సమయానికే క్షిపణులు భవనాన్ని తాకాయి"అని చెప్పారు. ఈ ఘటనలో మొజ్తబాకు కాలికి స్వల్ప గాయం మాత్రమే జరిగిందని ఆయన తెలిపారు. లీకైన ఆడియో వివరాల ప్రకారం, మొత్తం మూడు క్షిపణులు ఆ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. అందులో ఒకటి నేరుగా అలీ ఖమేనీ ఉన్న గదిపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడైంది. ఇరాన్ సైన్యాధ్యక్షుడు మహమ్మద్ షిరాజీ శరీరం పేలుడు ప్రభావంతో తీవ్రంగా ధ్వంసమై, గుర్తుపట్టలేనంత స్థితిలో ఉందని హొస్సేనీ పేర్కొన్నారు.

వివరాలు 

ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు అనుమానాలు

అలాగే మొజ్తబా బావ మిస్బా అల్ హుదా బఘేరి కనీ కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు, ఆయన తలకు తీవ్ర గాయమైందని తెలిపారు. ఇక మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. దాడి అనంతరం ఆయన ప్రజల ముందుకు రాకపోవడంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయని, "కొంతమంది ఆయన మరణించాడని అంటుండగా, మరికొందరు ఆయన ముఖం తీవ్రంగా దెబ్బతిన్నదని చెబుతున్నారు. ఆయన నిజంగా బ్రతికే ఉన్నాడో లేదో స్పష్టత లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ మాత్రం మొజ్తబా పంపిన రాతపూర్వక ప్రకటనను మాత్రమే ప్రసారం చేస్తుండటంతో ఆయన పరిస్థితిపై అనిశ్చితి కొనసాగుతోంది.

Advertisement