Anganwadi Centers: అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఒకవైపు రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. చాలా మంది కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) సహకారంతో మొత్తం 44,346 ఇండక్షన్ స్టవ్‌ల సరఫరాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వివరాలు
అంగన్‌వాడీల్లో ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ
ఈ కార్యక్రమం మొదటి దశలో భాగంగా ఇప్పటికే 11,400 ఇండక్షన్ స్టవ్‌లను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసినట్లు ఈఈఎస్ఎల్ వెల్లడించింది. 1,200 వాట్ల సామర్థ్యంతో పనిచేసే ఈ స్టవ్‌ల వాడకం వల్ల ఎల్పీజీపై అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు రూ.24 కోట్ల వరకు ఆదా సాధ్యమని భావిస్తున్నారు. అదేవిధంగా, ఈ మార్పు వల్ల దాదాపు 28,327 టన్నుల కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలను తగ్గించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
వివరాలు
అంగన్‌వాడీల్లో ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ
ఇండక్షన్ స్టవ్‌లు సాంప్రదాయ ఎల్పీజీ స్టవ్‌లతో పోలిస్తే సుమారు 30 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ చర్య కేంద్ర ప్రభుత్వ 'గో ఎలక్ట్రిక్' ప్రచారానికి అనుగుణంగా ఉండటమే కాకుండా, నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్‌కు మద్దతుగా నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను అందించేందుకు తక్షణ నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ అఖిలేష్ కుమార్ దీక్షిత్ కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ఇది కీలక ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీలకు ఈ స్టవ్‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
ఎల్పీజీపై సీఎం చంద్రబాబు సమీక్ష
యుద్ధ పరిస్థితుల ప్రభావం దృష్ట్యా రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వ్యవస్థలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో వివిధ గ్యాస్ సరఫరా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ఉన్నతాధికారులు వివరించారు. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలకు చెందిన 1,154 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోందని తెలిపారు.
వివరాలు
ఎల్పీజీపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు మళ్లకుండా తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెలివరీ సమయంలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో గ్యాస్ సరఫరాపై ఎలాంటి భయాందోళనలు లేకుండా చూడాలని సూచించారు. అన్న క్యాంటీన్లకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు వివరించగా, ప్రజల్లో గందరగోళం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు.
వివరాలు
ఎల్పీజీపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాల్లో నిత్య కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. హోటళ్ల సంఘాలతో చర్చలు జరిపి ఎల్పీజీ వినియోగాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించాలని సూచించారు. అలాగే, గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ సదుపాయం, ఇండక్షన్ స్టవ్‌ల వినియోగాన్ని విస్తరించే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.