Rajyasabha: రాజ్యసభ ఎన్నికలు 2026: కీలక రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నబీన్, బిహార్ ముఖ్యమంత్రి,జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులు కూడా బిహార్ నుంచి పైసభకు వెళ్లనున్నారు. ఇదే సమయంలో ఒడిశాలో క్రాస్ ఓటింగ్ కారణంగా ఎన్డీయే మూడో స్థానాన్ని కూడా దక్కించుకుంది. ఇక హర్యానాలో ఓట్ల లెక్కింపు నిలిచిపోవడంతో అక్కడి రెండు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. బిహార్ నుంచి ఎన్నికైన వారిలో నితిన్, నీతీశ్‌తో పాటు కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకుర్ (జేడీయూ), శివేశ్ కుమార్ (భాజపా),ఉపేంద్ర కుశ్వాహా (రాష్ట్రీయ లోక్ మోర్చా) ఉన్నారు. సోమవారం ఈ ఐదుగురి విజయం గురించి విధానసభ కార్యదర్శి మరియు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఖ్యాతి సింగ్ అధికారికంగా ప్రకటించారు.
వివరాలు
ఓటింగ్‌లో పాల్గొని కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు
వాస్తవానికి బిహార్‌లో నలుగురు అభ్యర్థులు సులభంగా గెలిచే పరిస్థితి ఉండగా, ఐదో అభ్యర్థికి కొన్ని ఓట్లు తక్కువ ఉన్నాయి. దీనితో ప్రతిపక్ష ఆర్జేడీ అమరేంద్ర ధారి సింగ్‌ను అభ్యర్థిగా నిలిపింది. అయినప్పటికీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులందరూ గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అలాగే ఆర్జేడీకి చెందిన ఒక ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. బంకీపుర్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబీన్ ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లనున్నారు.
వివరాలు
హరియాణాలో వివాదం.. కౌంటింగ్ నిలుపుదల
హరియాణాలోని రెండు రాజ్యసభ స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో భాజపా నుంచి సంజయ్ భాటియా,కాంగ్రెస్ నుంచి కరంవీర్ బోధ్,స్వతంత్ర అభ్యర్థిగా సతీశ్ నందల్ పోటీ చేశారు. సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగియగా,5గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే రహస్య ఓటింగ్ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయనే ఆరోపణలతో భాజపా, కాంగ్రెస్ పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ ముగిసే ముందు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్‌ను మడవకుండా బాక్సులో వేశారని భాజపా ఆరోపించింది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కూడా భాజపా నేత అనిల్ విజ్‌పై నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. రాజ్యసభ ఎన్నికల పారదర్శకత దెబ్బతింటోందని పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
వివరాలు
ఒడిశాలో క్రాస్ ఓటింగ్‌తో ఎన్డీయే దూకుడు
భువనేశ్వర్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒడిశా అధికార పార్టీ భాజపా మూడు స్థానాలను గెలుచుకుంది. మరో స్థానాన్ని బిజూ జనతాదళ్ దక్కించుకుంది. సోమవారం పోలింగ్ అనంతరం జరిగిన లెక్కింపులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, ప్రస్తుత ఎంపీ సుజిత్ కుమార్, భాజపా మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి మరియు మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం వల్లే ఎన్డీయే మూడో అభ్యర్థి గెలిచినట్లు సమాచారం.
వివరాలు
ఇప్పటికే 26 మంది ఏకగ్రీవ ఎన్నిక
ఇప్పటికే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఆర్పీఐ (ఏ) నాయకుడు రాందాస్ అఠావలె, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ, అన్నాడీఎంకేకు చెందిన తంబిదురై, భాజపా సీనియర్ నాయకుడు వినోద్ తావ్డే, తృణమూల్ కాంగ్రెస్ నేత బాబుల్ సుప్రియో తదితరులు ఉన్నారు.