Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు పిడుగులతో కూడిన వర్షాలు..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉండగా,మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోందని తెలిపింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా దక్షిణ కేరళ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వర్షాలతో పాటు ఉరుములు, పిడుగులు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వివరాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు
అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 44డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 43.6డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లాలోని నందనమారెళ్లలో 43.3 డిగ్రీలు,తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1డిగ్రీలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 42.2 డిగ్రీలు,పల్నాడు జిల్లా మాచర్లలో 41.5డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే నంద్యాల జిల్లా సంజామల,శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లిలో చెరో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.