Loading...
Gallantry and Service Medals: 1057 మంది పోలీసులకు గ్యాలంట్రీ, సేవా పతకాలు.. ఏపీ,తెలంగాణ నుంచి 36 మంది ఎంపిక
ఏపీ,తెలంగాణ నుంచి 36 మంది ఎంపిక

Gallantry and Service Medals: 1057 మంది పోలీసులకు గ్యాలంట్రీ, సేవా పతకాలు.. ఏపీ,తెలంగాణ నుంచి 36 మంది ఎంపిక

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ తదితర విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1057 మందిని ఈ పురస్కారాలకు కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది. వీరిలో 92 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 301 మందికి పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 664 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) అందనున్నాయి.

వివరాలు 

గ్యాలంట్రీ పతకాల్లో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల పోలీసులే అధికం

గ్యాలంట్రీ పతకాలకు ఎంపికైన 301 మందిలో 197 మంది తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులున్నారు.

జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తున్న 51 మంది, ఈశాన్య రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న 12 మంది పోలీసులకు కూడా ఈ పతకాలు దక్కాయి.

ప్రాణాలను, ఆస్తులను కాపాడటం, నేరాలను అడ్డుకోవడంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన పోలీసు సిబ్బందికి కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది ఈ పురస్కారాలను అందిస్తోంది.

వివరాలు 

ఏపీ నుంచి 21 మంది ఎంపిక

తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి కూడా ఈసారి పతకాలు దక్కాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 21 మంది ఎంపికయ్యారు. వీరిలో ఏడుగురికి గ్యాలంట్రీ మెడల్స్, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 11 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు లభించనున్నాయి.

ఏపీకి చెందిన ఐజీ గుడి విజయ్ కుమార్, ఐజీ బలంకారి వెంకట రామిరెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.

హెడ్ కానిస్టేబుళ్లు కొర్లాన మహేశ్, పైడి శ్రీరామమూర్తి, అడారి హేమసుందర రావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేశ్, ఆబోతుల అప్పలనాయుడు, రుతాల కన్నబాబుకు గ్యాలంట్రీ మెడల్స్ దక్కాయి.

ADVERTISEMENT

వివరాలు 

తెలంగాణ నుంచి 15 మంది

తెలంగాణ నుంచి మొత్తం 15 మంది ఈ పతకాల జాబితాలో చోటు సంపాదించారు.

వీరిలో ముగ్గురికి గ్యాలంట్రీ మెడల్స్, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, మరో 10 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు ప్రకటించారు.

తెలంగాణ అదనపు డిప్యూటీ కమిషనర్ జోగుల నర్సయ్య, ఎస్పీ ఆర్. జగదీశ్వర్ రెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.

జూనియర్ కమాండోలు బి. సత్యరావు, కె. సందీప్ కుమార్, జె. వంశీకృష్ణ గ్యాలంట్రీ మెడల్స్‌కు ఎంపికయ్యారు.

ADVERTISEMENT

వివరాలు 

21 మంది సీబీఐ అధికారులకు పతకాలు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో పనిచేస్తున్న 21 మంది అధికారులకు కూడా ఈసారి పతకాలు దక్కాయి.

వీరిలో ఆరుగురికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 15 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు ప్రకటించారు.

వీరిలో విశాఖపట్నం డీఎస్పీ (సీబీఐ)గా పనిచేస్తున్న సంజయ్ కుమార్ సమాల్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం లభించింది.

ADVERTISEMENT