LOADING...
Heliport: భారత్‌లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం
భారత్‌లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం

Heliport: భారత్‌లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ విమానయాన రంగంలో మరో కీలక మైలురాయిని భారత్ అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉండవల్లి హెలిపోర్టు కోసం దేశంలోనే తొలి ప్రైవేట్ పాయింట్-ఇన్-స్పేస్ (PinS) ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో హెలికాప్టర్ నావిగేషన్ వ్యవస్థ ఆధునికీకరణ దిశగా మరో ముందడుగు పడినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా హెలికాప్టర్లు ల్యాండ్ కావడానికి భూమిపై ఏర్పాటు చేసే ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తారు. అయితే PinS విధానంలో అలాంటి భూఆధారిత మౌలిక సదుపాయాల అవసరం ఉండదు. శాటిలైట్ ఆధారిత నావిగేషన్ సాయంతో హెలికాప్టర్లు అత్యంత కచ్చితత్వంతో, సురక్షితంగా హెలిపోర్టుల్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాంప్రదాయ ల్యాండింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడనుంది.

వివరాలు 

నియంత్రణ అనుమతి ఇచ్చిన DGCA

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ PinS విధానాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రూపొందించగా, దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నియంత్రణ అనుమతి ఇచ్చింది. ఈ విజయంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో తొలి PinS ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ విధానం అమల్లోకి రావడం హెలికాప్టర్ సేవల్లో కొత్త శకానికి నాంది పలికిందని అన్నారు. దీని ద్వారా విమాన భద్రత, నిర్వహణ సామర్థ్యం, అన్ని వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు.

వివరాలు 

ఆధునిక సాంకేతికతకు ప్రభుత్వం ప్రాధాన్యం

ఈ చారిత్రక ఘట్టం సాధించడంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహా అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేశాయని మంత్రి అభినందించారు. దేశవ్యాప్తంగా హెలికాప్టర్ సేవలను మరింత విశ్వసనీయంగా, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఆధునిక సాంకేతికతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఇటీవల ఈ ఏడాది చార్‌ధామ్ హెలికాప్టర్ సేవల తొలి దశను ఎలాంటి ప్రమాదాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేశామని, దీనికి ఆధునిక సాంకేతిక మౌలిక వసతులు దోహదపడ్డాయని రామ్ మోహన్ నాయుడు చెప్పారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సాంకేతిక ఆధారిత హెలికాప్టర్ వ్యవస్థను భారత్‌లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

తొలి PinS విధానానికి ఆమోదం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ విమానయాన రంగం వేగంగా సాంకేతిక అభివృద్ధి సాధిస్తోందని మంత్రి తెలిపారు. ఇటీవలే దేశీయంగా అభివృద్ధి చేసిన GAGAN ఆధారిత ప్రెసిషన్ అప్రోచ్‌ను వాణిజ్య విమానం ద్వారా విజయవంతంగా ప్రదర్శించామని గుర్తుచేశారు. ఇప్పుడు తొలి PinS విధానానికి ఆమోదం లభించడం అదే దిశలో మరో కీలక ముందడుగని అన్నారు. పనితీరు ఆధారిత నావిగేషన్ (PBN) వ్యవస్థను విస్తరించడం,స్వదేశీ శాటిలైట్ నావిగేషన్ సాంకేతికత వినియోగాన్ని పెంచడం,భారత విమానయాన రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఇది కీలకంగా మారనుందని తెలిపారు.

Advertisement

వివరాలు 

రిన్ని హెలిపోర్టుల్లో కూడా ఇలాంటి PinS విధానం 

దేశవ్యాప్తంగా మరిన్ని హెలిపోర్టుల్లో కూడా ఇలాంటి PinS విధానాలను అమలు చేయడానికి ఈ అనుమతి ఊతమివ్వనుంది. అత్యవసర వైద్య సేవలు, విపత్తు నిర్వహణ, పర్యాటకం, సముద్రతీర కార్యకలాపాలు, పుణ్యక్షేత్ర యాత్రలు, కార్పొరేట్ విమానయానం, ప్రాంతీయ అనుసంధానం వంటి సేవలకు ఇది మరింత బలం చేకూర్చనుంది. అలాగే దూర ప్రాంతాలు, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ (IFR) కింద మరింత సురక్షితంగా సేవలు అందించడంతో పాటు, ప్రతికూల వాతావరణం వల్ల ఏర్పడే అంతరాయాలను కూడా తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement