LOADING...
Modi: ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం.. 21 ఒప్పందాలు ఖరారు

Modi: ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం.. 21 ఒప్పందాలు ఖరారు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నతమైన 'ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న భౌగోళిక, రాజకీయ అస్థిరతల నేపథ్యంలో రక్షణ, వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఆధునిక సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు మూడురోజుల భారత పర్యటనకు వచ్చిన మెక్రాన్‌ మంగళవారం తెల్లవారుజామున ముంబయిలో అడుగుపెట్టారు. ఆయనకు మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం లోక్‌భవన్‌లో ఇరువురు నేతలు విస్తృతంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

వివరాలు 

మొత్తం 21 ఒప్పందాలపై సంతకాలు

ఇప్పటికే ఉన్న వ్యూహాత్మక బంధాలను మరింత బలోపేతం చేయడం, కొత్త రంగాలకు విస్తరించడం, ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమీక్షించడంపై సమాలోచనలు చేశారు. అలాగే ప్రాంతీయ, ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం కలిగిన అంశాలపైనా చర్చించారు. ఈ సమావేశాల సందర్భంగా మొత్తం 21 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్‌లో హామర్‌ క్షిపణుల తయారీకి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్‌ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం వీటిలో ముఖ్యమైనది. అంతేకాకుండా ఇరు దేశాల సైన్యాల మధ్య అధికారులను పరస్పరం నియమించుకునే ఒప్పందం కూడా కుదిరింది. చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

వివరాలు 

ఎవరెస్ట్‌ శిఖరంపైనా ఎగరగల సామర్థ్యం గల హెలికాప్టర్లు 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య ప్రత్యేకమైన, విశ్వాసంతో కూడిన అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఎన్నేళ్లుగా ఫ్రాన్స్‌ భారత్‌కు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా నిలుస్తోందని గుర్తు చేశారు. అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఈ భాగస్వామ్యాన్ని ఇప్పటివరకు లేనంత బలంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పరస్పర నమ్మకం, దూరదృష్టి ఆధారంగా ఈ బంధాన్ని ప్రత్యేక స్థాయికి చేర్చుతున్నామని చెప్పారు. ఎవరెస్ట్‌ శిఖరంపైనా ఎగరగల సామర్థ్యం గల హెలికాప్టర్లను రెండు దేశాలు కలిసి కర్ణాటకలో తయారు చేస్తున్నాయని, ప్రపంచంలోనే ఇది అరుదైన ప్రయత్నమని వివరించారు. ఈ హెలికాప్టర్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించారు. భారత్‌-ఐరోపా సంబంధాల్లో 2026 సంవత్సరం కీలక మలుపుగా మారనుందని చెప్పారు.

Advertisement

వివరాలు 

రక్షణ రంగంలో సహకారం 

ఇటీవలే ఐరోపా యూనియన్‌తో చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో ఫ్రాన్స్‌తో భారత్‌ కలిగిన బంధం ప్రపంచ స్థిరత్వానికి బలమైన ఆధారంగా నిలుస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన అధ్యక్షుడు మెక్రాన్‌, భారత్‌ తమకు అత్యంత విశ్వసనీయ భాగస్వాముల్లో ఒకటని అన్నారు. రఫేల్‌ యుద్ధవిమానాల నుంచి జలాంతర్గాముల వరకు రక్షణ రంగంలో సహకారాన్ని రెండు దేశాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలోనూ పరస్పర సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని వేమగల్‌లో ఏర్పాటు చేసిన ఎయిర్‌బస్‌ హెచ్‌125 హెలికాప్టర్ల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఇరు నేతలు వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే 'భారత్‌-ఫ్రాన్స్‌ నవకల్పన ఏడాది' కార్యక్రమాన్ని కూడా ఆరంభించారు.

Advertisement

వివరాలు 

రక్షణ ఒప్పందం పునరుద్ధరణ

బెంగళూరులో జరిగిన భారత్‌-ఫ్రాన్స్‌ ఆరో ద్వైపాక్షిక రక్షణ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫ్రాన్స్‌తో ఉన్న భారత రక్షణ ఒప్పందాన్ని మరో పదేళ్ల పాటు కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి కేథరిన్‌ వోట్రిన్‌తో పాటు ఇరు దేశాల త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత రక్షణ వ్యవస్థలను ఆధునికీకరించేందుకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

వివరాలు 

26/11 మృతులకు నివాళి.. సముద్ర తీరాన వ్యాహ్యాళి

ద్వైపాక్షిక చర్చలకు ముందు మెక్రాన్‌ తన సతీమణి బ్రిజట్‌తో కలిసి తాజ్‌ హోటల్‌ వద్దకు వెళ్లి 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో మరణించినవారికి నివాళులర్పించారు. అనంతరం మెరైన్‌ డ్రైవ్‌కు చేరుకుని జాగింగ్‌ చేశారు.నేవీ బ్లూ టీ షర్టు, నల్ల షార్ట్స్‌ ధరించి సాధారణ ప్రజల మధ్య కలిసిపోయి పరుగెత్తడం అక్కడివారిని ఆశ్చర్యానికి గురి చేసింది. చాలామంది వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. రెండు దేశాల భద్రతా బలగాలు కొంత దూరంలో ఉండి అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నాయి. మాక్రాన్‌కు ముంబయి ఇదే తొలి పర్యటన.ఆయన రాకపై ప్రధాని మోదీ 'ఎక్స్‌' వేదికగా కూడా స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఒకరినొకరు స్నేహితులుగా సంబోధించుకున్నారు.దిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో మెక్రాన్‌ పాల్గొననున్నారు.

Advertisement