PM Modi: "రిఫార్మ్,పెర్ఫార్మ్,ట్రాన్స్‌ఫార్మ్ మంత్రం ద్వారా భారతదేశం విజయం సాధించింది": ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన "ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2024"లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం డిసెంబరు 9 నుంచి 11 వరకు జరగనుంది. మోదీ మాట్లాడుతూ, "రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్"అనే మంత్రంతో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని తెలిపారు. గత పదేళ్లలో భారత్ ఆర్థిక పరంగా 10వ స్థానంలో ఉండగా,ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందన్నారు. ఆర్థిక రంగంలో అభివృద్ధి కారణంగా ఎగుమతులు రెట్టింపయ్యాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) కూడా రెండింతలు పెరిగాయని చెప్పారు. ఈ సమయంలో దేశంలో మౌలిక సదుపాయాలపై వ్యయం రూ.2లక్షల కోట్ల నుంచి రూ.12లక్షల కోట్లకు పెంచినట్టు వివరించారు.
"వికాస్ భీ-విరాసత్ భీ" అనే మంత్రంతో ప్రభుత్వం పని
భారత్ వంటి వైవిధ్యభరిత దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లడం ఎంతో గొప్ప అవకాశం అని, కొన్ని దశాబ్దాలపాటు మనం అత్యంత యువ జనాభా కలిగిన దేశంగా ఉంటామని మోదీ చెప్పారు. దేశంలో నైపుణ్యవంతులైన యువతీ యువకులు ఎక్కువగా ఉండటంతో, ఇది టెక్నాలజీ, డేటా ఆధారిత శతాబ్దానికి కీలకమని పేర్కొన్నారు. గత పదేళ్లలో ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లు పెరిగిందని, డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా పెరిగినట్టు వివరించారు. రాజస్థాన్ రాష్ట్రం అభివృద్ధి, సంస్కృతిని స్వాతంత్ర్యం తర్వాత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినట్టు మోదీ విమర్శించారు. "వికాస్ భీ-విరాసత్ భీ" అనే మంత్రంతో వారి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు చెప్పారు.
రూ. 30 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల
రాజస్థాన్ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా మారిందని, దేశంలోని అతిపెద్ద సోలార్ పార్కులు, డ్రైపోర్టులకు ఇది కీలక ప్రాంతమని తెలిపారు. రెండు ఎయిర్ కార్గో కాంప్లెక్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడినట్టు వివరించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మాట్లాడుతూ, ఇప్పటికే రూ. 30 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్టు తెలిపారు. అనంతరం బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, వేదాంతా రిసోర్సెస్ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రసంగించారు.