Bombay High Court: మనది లౌకిక దేశం.. దియా మీర్జా వీడియోను మళ్లీ అప్‌లోడ్ చేయండి: బాంబే హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం నేపథ్యంలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తీసుకున్న నిర్ణయంపై బాంబే హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణ, వాయు, శబ్ద కాలుష్యాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఆ వీడియోను తిరిగి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయాలని బీఎంసీని ఆదేశించింది. ఈ వీడియోను సోమవారం తొలగించిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కొందరు వ్యక్తులు సంకుచిత మనస్తత్వంతో వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. పర్యావరణ హితంగా దీపావళి పండగను జరుపుకోవాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రముఖులను ఎంపిక చేయాలని బీఎంసీ కమిషనర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
వివరాలు
సమాజంలోని ప్రతి ఒక్కరినీ గౌరవించాలన్న కోర్టు
పర్యావరణ పరిరక్షణ కోసం రూపొందించిన వీడియోకు అనవసరమైన రంగులు పులమడం బాధాకరమని పేర్కొంది.
ఈ మేరకు జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వీడియోపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిని ఉద్దేశిస్తూ.. సమాజంలోని ప్రతి ఒక్కరినీ వారి మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా గౌరవించాలని కోర్టు స్పష్టం చేసింది.
మనది లౌకిక దేశమని, పౌరులందరూ లౌకిక స్ఫూర్తిని పెంపొందించుకోవాలని రాజ్యాంగం ఆశిస్తోందని పేర్కొంది.
ప్రజల మధ్య ఐక్యత, సమాజం పట్ల ఉండే బలమైన అనుబంధం వల్లే ముంబయి వంటి నగరాలు మనుగడ సాగిస్తున్నాయని ధర్మాసనం తెలిపింది.
కొందరి బాధ్యతారహిత వ్యాఖ్యల వల్ల ఈ ఐక్యతకు భంగం కలగకూడదని అభిప్రాయపడింది.
వివరాలు
పర్యావరణ పరిరక్షణ అనేది మతం,కులానికి సంబంధించిన అంశం కాదు: కోర్టు
నటి వీడియోపై విమర్శలు చేసిన రాజకీయ నాయకులు లేదా ఇతర వ్యక్తులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా ఎలాంటి వీడియోలు రూపొందించినట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.
పర్యావరణ పరిరక్షణ అనేది మతం, కులానికి సంబంధించిన అంశం కాదని కోర్టు స్పష్టం చేసింది.
ప్రతి ఒక్కరూ పీల్చే గాలి ఒక్కటేనని గుర్తుచేసింది. ప్రజలకు నాయకత్వం వహించే పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి బాధ్యతాయుతమైన ప్రవర్తనను ఆశిస్తామని పేర్కొంది.
ఇలాంటి ఘటనలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.