Loading...
US Russia Sanctions Bill: ట్రంప్‌ 100% టారిఫ్‌ బిల్లు.. భారత్‌ కీలక స్పందన ఇదే
ట్రంప్‌ 100% టారిఫ్‌ బిల్లు.. భారత్‌ కీలక స్పందన ఇదే

US Russia Sanctions Bill: ట్రంప్‌ 100% టారిఫ్‌ బిల్లు.. భారత్‌ కీలక స్పందన ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన రష్యా ఆంక్షల బిల్లుపై భారత్‌ స్పందించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశం ఉన్నప్పటికీ.. తమ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దేశ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే చమురు కొనుగోళ్లకు ప్రాతిపదిక అని మరోసారి తేల్చిచెప్పింది.

వివరాలు 

అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం

అమెరికా ప్రతినిధుల సభ బుధవారం 'లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌ 2026' బిల్లుకు 262-159 ఓట్లతో ఆమోదం తెలిపింది.

ఈ బిల్లు ద్వారా రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కల్పించనున్నారు.

భారత్‌, చైనా వంటి దేశాలు ఈ బిల్లు పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ట్రంప్‌ తదుపరి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

అయితే ప్రతినిధుల సభ ఆమోదంతోనే భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్‌ అమల్లోకి వచ్చినట్లు కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వివరాలు 

భారత్‌ స్పందన ఇదే..

బిల్లు ఆమోదం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది.

దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో భారత్‌ స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపింది.

రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడంపై తమ విధానాన్ని ఇప్పటికే పలుమార్లు వివరించినట్లు గుర్తుచేసింది.

దేశంలోని 140 కోట్లకుపైగా ప్రజల ఇంధన అవసరాలను తీర్చేందుకు భారత్‌ వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందని పేర్కొంది.

రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ.. ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలనే భారత్‌ ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికాతో ఉన్నతస్థాయి చర్చలు

రష్యా నుంచి చమురు కొనుగోళ్ల అంశంపై భారత్‌, అమెరికా ప్రతినిధుల మధ్య గత కొన్ని నెలలుగా ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ బిల్లు వల్ల భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడే ప్రభావాలను కూడా అమెరికా వర్గాలకు ఇప్పటికే వివరించినట్లు పేర్కొంది.

అమెరికా చర్యల వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసింది.

తమ ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మరోసారి వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

ట్రంప్‌ నిర్ణయంపైనే తదుపరి చర్యలు

అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. అది ఇంకా చట్టంగా అమల్లోకి రాలేదు.

తదుపరి ప్రక్రియలో భాగంగా బిల్లు అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదానికి వెళ్లనుంది.

సంబంధిత చట్టానికి సంబంధించిన ఫైల్‌ ట్రంప్‌ డెస్క్‌ వద్దకు చేరినట్లు వైట్‌హౌజ్‌ వర్గాలు ధృవీకరించాయి.

అయితే ఏ దేశంపై టారిఫ్‌ విధించాలి? ఎంత శాతం సుంకం విధించాలి? అనే అంశాలు అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి.

అందువల్ల భారత్‌పై 100 శాతం టారిఫ్‌ ఎప్పుడు, ఎలా అమలవుతుందనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు.

వివరాలు 

బిల్లులో ప్రతిపాదించిన కఠిన చర్యలు

రష్యా ఆంక్షల బిల్లులో ఆ దేశం నుంచి చమురు,సహజవాయువు కొనుగోళ్లపై ఆంక్షలతో పాటు పలు కఠిన చర్యలను ప్రతిపాదించారు.

రష్యా 'షాడో ఫ్లీట్‌', ఆ దేశ నాయకత్వం,అధ్యక్షుడు పుతిన్‌తో పాటు పలువురు అగ్రనేతలు,ఆర్థిక సంస్థలు,ఇంధన రంగాన్ని కూడా ఈ చర్యలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.

ఉక్రెయిన్‌ యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఇంధన ఆదాయాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు.

అయితే ఈ బిల్లు భారత్‌పై ఎలా అమలవుతుంది? చమురు కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? టారిఫ్‌ విధిస్తే ఎంత మేరకు ఉంటుంది? అనే అంశాలు ట్రంప్‌ తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి.

ప్రస్తుతానికి భారత్‌ తన ఇంధన భద్రత,వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

వివరాలు 

లిండ్సే గ్రాహం పేరుతో బిల్లు

అమెరికా రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం 2026 జులైలో ఉక్రెయిన్‌ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన మరుసటి రోజే మరణించారు.

రష్యాపై కఠిన ఆంక్షలు విధించే ఉద్దేశంతో ఈ బిల్లును ఆయనే ముందుకు తీసుకెళ్లారు. ఆయన గౌరవార్థం ఈ బిల్లుకు 'లిండ్సే ఓ. గ్రాహం' అనే పేరు పెట్టారు.

ADVERTISEMENT