LOADING...
Helicopter Unit: కర్ణాటక వేమగల్‌లో దేశ తొలి ప్రైవేటు హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ కేంద్రం ప్రారంభం
కర్ణాటక వేమగల్‌లో దేశ తొలి ప్రైవేటు హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ కేంద్రం ప్రారంభం

Helicopter Unit: కర్ణాటక వేమగల్‌లో దేశ తొలి ప్రైవేటు హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ కేంద్రం ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా వేమగల్‌లో భారతదేశంలోనే తొలి ప్రైవేటు రంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. 'ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ (ఎఫ్‌ఏఎల్‌)'గా పేరున్న ఈ యూనిట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ కలిసి ముంబయి నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. వేమగల్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి కేథరిన్‌ వోట్రిన్, కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్, ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌ సీఈవో బ్రూనో ఈవెన్‌ పాల్గొని ఎఫ్‌ఏఎల్‌ కేంద్రంలోని నిర్మాణాలు, ఏర్పాట్లను పరిశీలించారు.

వివరాలు 

వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు

ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ, సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ కేంద్రం ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించడం ప్రస్తుతం భారత ఆర్థిక విధానానికి ప్రధాన ఆధారాలుగా మారాయని అన్నారు. ప్రోత్సాహక పథకాలు, పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సరళీకరించడం వల్ల గత పదేళ్లలో రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. అలాగే భారతీయ ఎంఎస్‌ఎంఈలు విదేశాల అవసరాలకు అనుగుణంగా రక్షణ పరికరాలు తయారు చేసి ఎగుమతులు చేస్తున్నాయని వివరించారు.

వివరాలు 

తొలి హెలికాప్టర్‌ను 2027 నాటికి సిద్ధం

ఎఫ్‌ఏఎల్‌ కేంద్రంలో తొలి హెలికాప్టర్‌ను 2027 నాటికి సిద్ధం చేయాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. ఈ యూనిట్‌లో హెచ్‌125 హెలికాప్టర్‌కు సంబంధించిన విడిభాగాల అసెంబ్లింగ్‌, నిర్వహణ, మరమ్మతు పనులు చేపడతారు. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ మరియు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ సంస్థలు కలిసి ఇక్కడ హెలికాప్టర్లను తయారు చేయనున్నాయి. ఆరు సీట్ల సామర్థ్యం కలిగి, సుమారు 630 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ హెలికాప్టర్లు అంబులెన్స్‌ సేవల వంటి అవసరాలకు విస్తృతంగా ఉపయోగపడనున్నాయి.

Advertisement