J&K: జమ్ముకశ్మీర్‌లో 2025లో ఒక్క రాయి దాడి కూడా లేదు.. రక్షణ శాఖ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో 2025 సంవత్సర భద్రతా పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వివరాలను వెల్లడించింది. రక్షణ మంత్రిత్వ శాఖ 2025-26 వార్షిక నివేదిక ప్రకారం.. గతేడాది జమ్మూకశ్మీర్‌లో రాళ్లు రువ్విన ఘటనలు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో ఉగ్రవాద సంస్థల్లో చేరిన స్థానిక యువత సంఖ్య కూడా కేవలం ఒక్కరికి తగ్గింది.
వివరాలు
స్థానిక యువత ఉగ్రవాదం వైపు మళ్లే పరిస్థితి తగ్గుముఖం
జమ్మూకశ్మీర్‌లో స్థానిక యువత ఉగ్రవాద సంస్థల్లో చేరే సంఖ్య గత కొన్నేళ్లుగా గణనీయంగా తగ్గుతూ వస్తోంది.
2021లో 146 మంది, 2022లో 121 మంది ఉగ్రవాదంలో చేరారు. 2023లో ఈ సంఖ్య 19కి, 2024లో నాలుగుకు తగ్గింది.
2025లో మాత్రం ఒక్క స్థానిక యువకుడు మాత్రమే ఉగ్రవాద సంస్థలో చేరినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది.
స్థానిక యువత హింసా మార్గాన్ని వీడి.. ప్రభుత్వ సంక్షేమ, ఉపాధి కార్యక్రమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
వివరాలు
రాళ్ల దాడులు సున్నా.. చొరబాటు ప్రయత్నాలు అడ్డుకున్న భద్రతా బలగాలు
జమ్మూకశ్మీర్‌లో గతంలో భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య రాళ్ల దాడుల ఘటనలు తరచుగా చోటుచేసుకునేవి.
అయితే 2025లో అలాంటి ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2010-14 మధ్య జమ్మూకశ్మీర్‌లో ఏటా సగటున సుమారు 2,654 రాళ్లు రువ్వే ఘటనలు నమోదయ్యాయి.
2022 తర్వాత ఈ ఘటనలు దాదాపు సున్నా స్థాయికి చేరుకున్నాయి.
ఇదిలా ఉండగా.. 2025లో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించి ఆరు ప్రయత్నాలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది.
భద్రతా బలగాలు ఈ ప్రయత్నాలన్నింటినీ అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన 12 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వివరాలు
పర్యాటకంగానూ జమ్మూకశ్మీర్‌కు పెరిగిన ఆదరణ
జమ్మూకశ్మీర్ పర్యాటక రంగంలోనూ అభివృద్ధి సాధిస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడించింది.
2025లో జమ్మూకశ్మీర్‌ను 2.3 కోట్ల మంది పర్యాటకులు సందర్శించినట్లు నివేదిక పేర్కొంది.
వీరిలో 4.13 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రికులు ఉన్నారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగినప్పటికీ.. పర్యాటకుల సంఖ్య పెరగడం గమనార్హమని నివేదిక తెలిపింది.