Snowfall: జమ్ము కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు వర్షం.. ఎంజాయ్ చేస్తున్న స్థానిక ప్రజలు, పర్యాటకులు..
జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు వర్షం కురుస్తుండగా, బారాముల్లా, సోనమార్గ్, బందిపోర వంటి అనేక ప్రాంతాలు తెల్లటి మంచు పరుచుకుని భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తూనే ఉండటంతో రోడ్లు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, అలాగే కొండలు తెల్లటి చీరను కప్పుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాలు స్థానికులను, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ మంచు వర్షాన్ని స్థానికులు ఆనందంగా ఆస్వాదిస్తుండగా, పర్యాటకులు కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
మంచు.. విదేశాల నుంచీ వచ్చిన టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి
ప్రత్యేకంగా శీతాకాలంలో జమ్ము కశ్మీర్ పర్యాటకుల తాకిడితో మరింత సందడిగా మారుతోంది. మంచు తెరలతో అలంకరించిన లోయలు, కొండలు భారతదేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా, విదేశాల నుంచీ వచ్చిన టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మంచు వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి . మరోవైపు ,భారీ మంచు వర్షం కారణంగా శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి మైనస్ 1 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇది చలి తీవ్రతను మరింత పెంచి, స్థానిక ప్రజలను ప్రభావితం చేస్తోంది. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు వారు చలిమంటల దగ్గర గుంపుగా చేరి వేడివేడిగా గడుపుతున్నారు.