Janga Krishnamurthy: టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపినట్లు సమాచారం. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలంటూ ఆ లేఖలో సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కోరినట్లు తెలిసింది. ఈ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను కూడా లేఖలో ఆయన వివరించినట్లు సమాచారం. గతంలో తనకు కేటాయించినట్లు చెప్పబడుతున్న బాలాజీనగర్‌లోని ప్లాట్ నంబర్-2 ఇప్పటికీ ఖాళీగానే ఉందని, ఆ భూమిని తనకు కేటాయించాలని ప్రభుత్వాన్ని జంగా కృష్ణమూర్తి కోరినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం టీటీడీ బోర్డుకు పంపగా, అక్కడ ఆమోదం లభించినట్లు సమాచారం.
Details
ఆ కేటాయింపురద్దుతో రాజీనామా చేసినట్లు సమాచారం
అయితే గురువారం (09-01-2026) జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ భూ కేటాయింపును రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతోనే ఆయన టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జంగా కృష్ణమూర్తి 2024 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కూటమికి ఆయన మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను సీఎం చంద్రబాబు ప్రారంభించగా, టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడును నియమించి, పాలకమండలి సభ్యులుగా పలువురిని నియమించారు.
Details
వైసీపీలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం
ఆ జాబితాలో జంగా కృష్ణమూర్తికి కూడా స్థానం కల్పించారు. టీడీపీలో చేరకముందు జంగా కృష్ణమూర్తి వైసీపీలో కొనసాగారు. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఆయనకు అప్పటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. టీటీడీ చైర్మన్ పదవికి వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేసిన అనంతరం, ఆ స్థానం జంగా కృష్ణమూర్తిని వరిస్తుందనే చర్చ జరిగింది. అయితే చివరికి ఆ పదవిని వైఎస్ జగన్ భూమన కరుణాకర్ రెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే.